Skip to content Skip to footer

सर्वे जनाः सुखिनो भवन्तु

सत्यं वद । धर्मं चर

Veda Samskruthi Samiti

వ్యాసములు (Essays)

🙏శ్రీ దక్షిణామూర్తి తత్త్వము. 🙏

నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే !
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః !!

“స్ఫటిక రజత వర్ణం మౌక్తికీమక్షమాలా
మమృత కలశ విద్యాం జ్ఞానముద్రాం కరాగ్రే !
దధత మురగకక్షం చంద్ర చూడం త్రినేత్రం
విధృత వివిధ భూషం దక్షిణామూర్తి మీడే”!!

పరబ్రహ్మమైన పరమేశ్వరుడు జిజ్ఞాసువులకు, ముముక్షువులకు బ్రహ్మ జ్ఞానము కలిగించుట కొరకు, సర్వ మానవులకు లౌకిక, పారలౌకికమైన సకల శుభాలను కలిగించటానికి పరా అపరా విద్యలకు ఆది గురువుగా గురుస్వరూపమైన శ్రీ దక్షిణామూర్తిగా అవతరించాడు. నిర్గుణము, నిష్కళము, నిరవద్యము, నిరంజనము అయిన పరతత్వము సర్వమానవాళిని అనుగ్రహించుట కొరకు, అనేక ప్రయోజనముల కొరకు అనేక పర్యాయములు అనేక సగుణ సాకార రూపములను ధరించి అనుగ్రహించాడు. సృష్ట్యాదిలోనే చతుర్ముఖ బ్రహ్మకు సృష్టి చేయడానికి కావలసిన జ్ఞానముననుగ్రహించిన, సనక, సనందన సనత్కుమార, సనత్సుజాతులు అనబడే బ్రహ్మమానస పుత్రులైన బ్రహ్మవేత్తలకు మౌనంగానే చిన్ముద్రతో, కేవలం దర్శనము చేత సకల సంశయములను పోగొట్టి బ్రహ్మజ్ఞానమును అనుగ్రహించిన గురుస్వరూపము శ్రీ దక్షిణామూర్తి స్వరూపము. పరమేశ్వరుని యొక్క యోగమూర్తి స్వరూపము శ్రీ దక్షిణామూర్తి. “జ్ఞానాదేవ తు కైవల్యమ్.” జ్ఞానము వల్లే ముక్తి కలుగుతుంది. “ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసనా” ఈశ్వర అనుగ్రహంతోనే అద్వైత జ్ఞానం కలుగుతుంది. ఆ బ్రహ్మవిద్యకు తొలి గురువు శ్రీ దక్షిణామూర్తి. బ్రహ్మవిద్యను అనుగ్రహించి మనలను తరింప చేయడానికి ఈశ్వరుడే శ్రీదక్షిణామూర్తిగా వచ్చాడు. వేదములలోను, కృష్ణ యజుర్వేదాంతర్గతమగు దక్షిణామూర్తి ఉపనిషత్తులోను, దక్షిణామూర్తి సంహిత అనే సంహితా గ్రంథములోను, శివపురాణంలోను, శ్రీరుద్రములోను, శ్రీమద్భాగవతములో, పురాణేతిహాసములలో, దక్షయజ్ఞ కథా ఘట్టంలో, మరెన్నో చోట్ల దక్షిణామూర్తి యొక్క తత్వము ప్రతిపాదింపబడినది, బోధింపబడినది. జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం రచించి మనకందించారు.

“దక్షిణశ్చాసౌమూర్తిః దక్షిణామూర్తిః”. ‘దక్షిణ’ లో నుంచి ‘దక్షత’ అనే పదం వచ్చింది. ‘దక్షత’ అంటే ‘సమర్థత’. “దక్షిణామూర్తి” అంటే “సర్వ సమర్ధుడు”, అని ఒక అర్థము, “దక్షిణం వైపు కూర్చుని ఉంటాడు కనుక దక్షిణామూర్తి” అని మరొక అర్ధము ఉన్నది.

అనంత విశ్వంలోని పంచకృత్యముల శక్తి ఒక రూపు కడితే, అది దక్షిణామూర్తి స్వరూపం. ప్రకృతికి, సర్వ దేవతలకు, పంచభూతములకు, సర్వేంద్రియములకు, సర్వప్రాణికోటికి వారి వారిలో ఉన్న శక్తులు పనిచేసే సామర్థ్యమే దక్షత, సమర్థత. దానిని వారికి అనుగ్రహించినది దక్షిణామూర్తి. బుద్ధి శక్తి, ప్రాణశక్తి, వాక్శక్తి, ధారణ శక్తి, ప్రకటన శక్తి, సర్వశక్తులు దక్షిణామూర్తి అనుగ్రహం వల్లే మనకు లభిస్తున్నాయి. ఎవరు ఏ విద్యలో, ఏ వృత్తిలో ఏ ప్రతిభ కలిగి ఉన్నా, అది దక్షిణామూర్తి ప్రసాదిత అనుగ్రహ శక్తే ! లౌకికమైన సర్వ విద్యలకు ఆధారము ఆయనే ! విశేషంగా బ్రహ్మ విద్యాధి దేవత శ్రీ దక్షిణామూర్తి గురుస్వరూపము. కనుక బ్రహ్మవిద్యకు తొలి గురువు శ్రీ దక్షిణామూర్తి. ఆయన నుంచి ఇప్పటి వరకు బ్రహ్మవిద్యా గురు పరంపర కొనసాగుతూ వస్తోంది. శ్రీ దక్షిణామూర్తి నుంచి విద్యను నేర్చుకున్న వారు శ్రీమన్నారాయణుడు. ఆయన నుంచి పద్మభవుడు….. అలా పరంపర కొనసాగింది. ఈ గురు పరంపరనే అద్వైత గురు పరంపరగా కూడా ప్రార్థిస్తాము. ఎందుకంటే, బ్రహ్మవిద్య అంటే అద్వైత జ్ఞానానుభవమే !

“పరబ్రహ్మ పరమేశ్వర స్వరూప శ్రీ దక్షిణామూర్తిః
బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రథమ గురుః”! తస్మాత్ –

“నారాయణం, పద్మభువం, వసిష్ఠం,
శక్తిం, చ తత్పుత్ర పరాశరం చ
వ్యాసం, శుకం, గౌడపదం మహాన్తమ్
గోవింద యోగీంద్ర మథాస్య శిష్యమ్
శ్రీ శంకరాచార్య మథాస్య శిష్యమ్ …..” అలా మనకు జ్ఞానాన్ని బోధించిన గురువుల వరకు భక్తితో స్మరించి నమస్కరించడం బ్రహ్మవిద్యా సంప్రదాయము. శ్రీవిద్యకు కూడా గురువు శ్రీ దక్షిణామూర్తే ! చైతన్య రూపంలో స్పందన శక్తిగా దక్షిణామూర్తి విశ్వమంతా నిండి ఉన్నాడు కనుకే విశ్వము వ్యక్తమవుతోంది, అనుభూతమవుతున్నది. కనపడని విద్యుచ్ఛక్తి ప్రసరిస్తూ ఉంటేనే, బల్బులు, ఫ్యానులు, మిక్సీలు, టీవీలలాంటి పరికరాలని పనిచేస్తూ ఉంటాయి. అలాగే, ఆత్మ చైతన్యంగా ఆయన మన లోపల ఉన్నాడు కనుకే మన ప్రాణ శక్తులు, ఇంద్రియ శక్తులు, బుద్ధి శక్తులు అన్ని పనిచేస్తున్నాయి. మనలోని ఆ పని చేయగల సమర్ధతే దక్షత ! అదే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ఉపాసన వలన సమస్త విద్యలు లభిస్తాయి, సరస్వతీ కటాక్షం కలుగుతుంది, మేధస్సు వృద్ధి చెందుతుంది, అపమృత్యు దోషం నశిస్తుంది, గ్రహదోషాలు తొలగిపోతాయి.

దక్షిణామూర్తిని ప్రప్రథమంగా దర్శించినది చతుర్ముఖ బ్రహ్మ దేవుడే ! సృష్ట్యాదిలో బ్రహ్మదేవునికి సృష్టి చేయగలిగిన సామర్థ్యాన్ని అనుగ్రహించిన దక్షిణామూర్తి, తాను సృష్టించిన జీవులను చూస్తున్నా ఎటువంటి శోక మోహాలు కలగకుండా, దేనికి అంటకుండా పరమేశ్వరార్పణ భావనతో సృష్టి చేయగల శక్తిని, సామర్ధ్యాన్ని బ్రహ్మదేవునికి అనుగ్రహించాడు అని శివపురాణంలో చెప్పబడింది. బ్రహ్మదేవుడు తనకు సృష్టికార్యంలో సహాయం చేస్తారని భావించి సనకసనందనాదులు అనే నలుగురు మానసిక పుత్రులను ఉత్పన్నం చేశాడు. కానీ వారు పుట్టిందే బ్రహ్మవిద్య కోసం ! పుట్టుకతోనే వారు బ్రహ్మ జిజ్ఞాసువులు, బ్రహ్మజ్ఞానులు. ఈశ్వరుడి నుంచి బ్రహ్మ జ్ఞానోపదేశం పొందాలని కైలాసానికి వెళ్ళారు. ఆ సమయంలో శివుడు జగన్మాత పార్వతీదేవితో కలిసి ఆనందతాండవ నాట్యం చేస్తున్నాడు. సంసారి అయిన ఈయన తమకు ఎలా బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు అనుకుని వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్లేటప్పటికీ నూరు యోజనాల పొడవు, 75 యోజనాల విస్తీర్ణం కలిగిన మఱ్ఱిచెట్టు మొదట్లో కూర్చుని పదహారేళ్ల యువకుడు అనిర్వర్ణనీయమైన బ్రాహ్మీ తేజో రాశితో ప్రకాశిస్తూ కనపడ్డాడు. శుద్ధ స్పటికము వలె, వెండి వలె తెల్లగా ప్రకాశిస్తూ, పామును నడుముకు ధరించి, తలపై చంద్రరేఖతో త్రినేత్రుడై కుడికాలు నేలమీద ఆనించి, ఎడంకాలిని కుడికాలి తొడ మీద పెట్టి వీరాసనం వేసుకుని, ఒక చేతిలో వేదములను, మరొక చేతిలో అక్షమాలను, మరొక చేతిలో అమృత కలశమును (యజ్ఞ సూచకము, జ్ఞాన సూచకము అయిన అగ్నిహోత్రుని) ధరించి, ఒక చేతితో చిన్ముద్ర వహించి కూర్చున్న దక్షిణామూర్తి పరమ ప్రశాంతమూర్తిగా శోభిల్లుతూ చిరు దరహాసంతో దర్శనమిచ్చాడు. ఆయన చుట్టూ అనేకమంది వృద్ధులైనటువంటి మహర్షులు శిష్యులలాగా కూర్చుని ఉన్నారు. అలా వటవృక్ష నీడలో కూర్చుని, మౌనంగా జ్ఞానబోధ చేస్తున్న శ్రీ దక్షిణామూర్తిని చూసి, ఆయన దగ్గరకు వెళ్ళి కూర్చోగానే వారి సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. ఆయనే పరమేశ్వరుడు, తమకు జ్ఞానబోధ కలిగించడానికే ఇక్కడ అవతరించాడని వారికి అర్థమైంది. దక్షిణామూర్తి దర్శన మాత్రం చేత వారికి అననుభూతమైన దివ్యానుభూతి దొరికింది. దీపం వెలిగించగానే చీకటి అంతమై, వెలుగు వ్యాపించినట్లుగా, వారికి సందేహాలు తీరి సమాధానం లభించింది. అక్కడ కైలాసంలో శివపార్వతులుగా ఇద్దరుగా ఉన్న ఈశ్వరుడు ఇక్కడ దక్షిణామూర్తిగా ఒక్కడే కనిపించినా, ఇద్దరు ఒక్కరే ! అమ్మవారు ఆయనలోనే అణిగి ఉన్నది. శివపార్వతులు అర్ధనారీశ్వరులు. వారు అవిభాజ్యులు. దక్షిణామూర్తి అర్ధనారీశ్వర స్వరూపమని తెలియజేయటానికి స్వామివారి ఎడమ చెవికి తాటంకము, కుడి చెవికి మకర కుండలము ఉంటాయి.

” మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానో
వర్షిష్టాంతే వసదృష్టిగణై రావృతం బ్రహ్మ నిష్ఠై
రాచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే”!!
వయసున యువకుని వలె కనిపించుచు, ముదుసలులు, బ్రహ్మనిష్ఠులైన శిష్యుల చేత పరివేష్ఠింపబడి, వారలకు తన మౌన మాత్రము చేతనే బ్రహ్మ తత్వమును తేట తెల్ల మగునట్లుగా ఉపదేశించుచు, సంశయములను పారద్రోలుచున్నవాడును, కుడిచేతియందు అంగుష్ఠము – బొటనవేలు, తర్జని – చూపుడువేలు సంయోగరూప చిన్ముద్రను, జ్ఞానముద్రను ధరించి, స్వాత్మానందము ననుభవించుచున్న ఆనంద స్వరూపుడైన, ప్రసన్న వదనుడైన శ్రీ దక్షిణామూర్తిని స్తోత్రము చేయుచున్నాను. శ్రీ దక్షిణామూర్తి గురించి ఇలా చెప్పారు –
” చిత్రం వటతరోర్మూలే వృద్ధాశ్శిష్యాః గురుర్యువా !
గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః”!!
ఎంత ఆశ్చర్యం ! వటవృక్షము – మఱ్ఱి చెట్టు మొదట్లో యువకుడైన గురువుగారు కూర్చుని ఉన్నారు. క్రింద వృద్ధులైన శిష్యులు కూర్చున్నారు. గురువుగారు మౌనంగా వ్యాఖ్యానిస్తున్నారు, శిష్యుల సందేహాలన్నీ తీరిపోయాయి.
” యతో వాచోనివర్తంతే! అప్రాప్య మనసా సహ”!! దేనిని మాటలు చెప్పలేవో దానిని మౌనము బోధిస్తుంది.

దక్షిణామూర్తి వటవృక్షం క్రింద ఎందుకు కూర్చున్నారు, అంటే, వటవృక్షాన్ని సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపంగా చెప్తారు. వట వృక్షమును ఎవరూ నాటి, పెంచి, పెద్ద చేయరు. వటవృక్షంలోని కాయలలోని చిన్ని గింజలు ఎగిరిపడి తనంత తానుగా ఉద్భవిస్తుంది. ఒకసారి వటవృక్షం పుట్టిందా, ఇంక దానికి మరణం అనేదే లేదు. ఎందుకంటే మర్రి చెట్టు నుంచి పుట్టిన ఊడలు నేలలో దిగి వ్రేళ్ళను వృద్ధి చేసుకుని, ప్రతి ఊడ వృక్షంగా పరిణమిస్తుంది. తన కొమ్మలు, రెమ్మలు, ఊడలు, ఆకులతో తన మూలాన్ని తానే కమ్ముకుంటుంది ఊడలమఱ్ఱి. ఎవరికైనా దాని మూలాన్ని చేరటం చాలా కష్టం. మర్రిచెట్టు ఊడలను పట్టుకుని నేలను తాకకుండా గాలిలోనే ఎగురుతూ ఎంత దూరమైనా ఆకాశయానంగా ప్రయాణం చేయవచ్చును. మర్రిచెట్టు ఇచ్చేట్లుగా నీడను ఈ ప్రపంచంలో వేరే ఏ చెట్టు ఇవ్వలేదు. దేవతాంశ కలిగిన వనస్పతి చెట్టు మర్రిచెట్టు. ఎందుకంటే పువ్వులు లేకుండానే దీనికి కాయలు వస్తాయి. ఈ చెట్టు పాలు కారుస్తుంది. అంత పెద్ద చెట్టుకు చిన్ని చిన్ని కాయలుంటాయి. ఈ వృక్షం క్రింద సేద తీరుతున్న వారి మీద ఈ కాయలు పడినా, ఎవరికీ దెబ్బలు తగలవు. ‘వట’ అంటేనే ‘నీడనిస్తుంది’ అని అర్థం. అంటే తాపంతో బాధపడే వారికి ఉపశాంతిని ఇచ్చేది వటవృక్షం సంసారతాపమును, ఆధ్యాత్మిక, ఆతిభౌతిక, ఆధిదైవిక తాపాలను ఉపశమింప చేసి పునరావృత్తి రహితమైన శాశ్వతానందాన్ని కలిగిస్తాడు ఆ వటతరు మూల స్థితుడైన దక్షిణామూర్తి. “సంసార భ్రమణ తాపోపశమనం” అన్నారు జగద్గురువులు శివానందలహరిలో ! భగవంతుడు అనుభవంలోకి వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. పరబ్రహ్మకు మారుపేరు వటవృక్షము. అంతటి మహత్తు కలిగిన వటవృక్ష ఛాయలో ఉంటాడు శ్రీ దక్షిణామూర్తి.

ఏమీ మాట్లాడకుండానే శిష్యుల సందేహాలు ఎలా తీరతాయి ? అనే సందేహం తత్వం అర్థం చేసుకోలేని వారికి కలగవచ్చును. సాక్షాత్తుగా పరమాత్మకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా ? అఘటన ఘటనా సమర్థుడు కదా పరమేశ్వరుడు ! దృగ్దీక్షతో లౌకిక గురువులే జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నారే, కేవల స్పర్శతో శ్రీరామకృష్ణ పరమహంస, తన శిష్యుడైన స్వామి వివేకానందను ఒక విధమైన ఆధ్యాత్మిక అనుభూతి స్థితిలోకి – ట్రాన్స్లోకి పంపించారే, శ్రీ రమణ మహర్షి కేవలం తన చల్లని చూపులతోనే ఎందరికో సందేహాలను నివారించి, జ్ఞానాన్ని, చిత్త శాంతిని కలిగించారే ! సాక్షాత్తుగా గురుస్వరూపులైన సాంబ సదాశివుడు దర్శన మాత్రంతో బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించలేడా ? అనుగ్రహించగలడు అని గ్రహించాలి. అనుభవానికి అనుభవమే కావాలి కానీ మాటలు కాదు. తీయదనాన్ని గురించి చెప్పాలంటే, మధురంగా ఉంటుంది, తేనెలా ఉంటుంది, లడ్డులా ఉంటుంది అని ఎంత చెప్పినా, అది భౌతికమైన వివరణే ! కొద్దిగా చక్కెర నోట్లో వేస్తే, తియ్యదనం అంటే ఏమిటో తెలుస్తుంది. అది అనుభవం. తుమ్మెద పువ్వు చుట్టూ తిరుగుతూ, ఝుంకారం చేస్తూ ఉంటుంది. ఒకసారి పువ్వు మీద వాలి మకరందం ఆస్వాదించడం ప్రారంభించగానే ఇంక శబ్దం ఉండదు. వేదాలు చదివినా, శాస్త్రాలు వల్లె వేసినా, భగవంతుడు తెలియనంత వరకు జ్ఞానం కలగదు సందేహాలు ఉంటూనే ఉంటాయి. భగవద్ జ్ఞానము కేవలము భగవదనుగ్రహంతోనే సాధ్యమవుతుంది.

“యమేవైష వృణుతే, తేన లభ్యః!
తస్యైషాత్మా వివృణుతే తనూన్ స్వామ్”!!
అని ఉపనిషత్తు చెప్తోంది. భగవంతుడెవరో తెలిశాక, ఆ అనుభవంలో ఆనందము, ప్రశాంతత ఉంటాయి. అంతర్ముఖంగా ఆత్మలో రమించటమే మౌనము. మాట్లాడకుండానే అవతలి వారి సందేహాలు తీరాయి అంటే అర్థము ఆయన తన అలౌకిక శక్తితో సందేహాలను తీర్చారనుకోవచ్చును. లేదా, సంకేత భాషలో మాట్లాడారు అని అనుకోవచ్చును. చేతిలోని చిన్ముద్ర జీవబ్రహ్మైక్యాన్ని బోధిస్తున్నది. చూపుడు వేలు జీవునికి, బొటనవేలు పరమాత్మకు ప్రతీకలు. ఎవరైనా ధ్యానంలోనున్నప్పుడు సాధన ద్వారా మూలాధార చక్రంలో నున్న కుండలినీ శక్తిని ప్రచోదన చేసి పైకి సహస్రార చక్రం వరకు పంపవచ్చును. జ్ఞానబోధ చేయటానికి వచ్చిన దక్షిణామూర్తి ఆ యోగ ప్రక్రియను కేవలము తన చూపుతో ఎదురుగానున్న శిష్యులలో కలిగించగల సమర్థుడు. అదే అంతర్ముఖ సాధన. జ్ఞానం వల్ల మనసు ఆత్మను పట్టుకుంటుంది. జీవాత్మ విశ్వాత్మతో అనుసంధానించబడి, దక్షిణామూర్తి అనుగ్రహంతో ఆయన శిష్యులలో కుండలినీ శక్తి జాగృతమయి వారికి జ్ఞానము, ఆనందము లభిస్తాయి. గురువు యువకుడు అంటే, కాలానికి లొంగనివాడు, కాలాతీతుడు అని అర్థము. శిష్యులు వృద్ధులు అంటే వారు కాలబద్ధులని గ్రహించాలి.

శ్రీ గురుదక్షిణామూర్తి దక్షిణం వైపున కూర్చున్నాడు అంటే ఆయనకు అభిముఖంగా కూర్చున్న ఆయన శిష్యులు ఉత్తరాన్ని చూస్తున్నారని అర్థం. సృష్టిలోని సర్వప్రాణులు దక్షిణాభిముఖంగానే ప్రయాణిస్తుంటారు. జనన మరణ వలయంలో తిరుగుతూనే ఉంటారు. కానీ ఎవరైతే ఉత్తరాభిముఖులై దక్షిణామూర్తిని దర్శిస్తున్నారో, వారికి ఇంక మళ్ళీ జన్మించాల్సిన అవసరముండదు. పునరావృత్తి రహితమైన శాశ్వత పరమాత్మ సన్నిధిని చేరుతారు. ఉత్తరము అంటే ఉత్ తరము. ఉత్ అంటే పైకి – పరమాత్మ దగ్గరికి. తరము అంటే దాటి వెళ్ళటము. అందుకే ముక్కోటి ఏకాదశి నాడు స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శిస్తాము. ప్రతి శివాలయంలోనూ దక్షిణ దిక్కులో గోడలో దక్షిణామూర్తిని పెడతారు. వశిష్ట మహర్షి యొక్క నూరుగురు పుత్రులు మరణిస్తే, బ్రహ్మజ్ఞాని అయిన వశిష్ట మహర్షి ఆ పుత్రశోకం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే భూదేవి కాపాడి తపస్సు చేయమని ఆదేశిస్తుంది. కఠోర తపమాచరించిన ఆ మహర్షికి పార్వతీ సమేతుడైన శివుడు ప్రత్యక్షమయ్యాడు. వశిష్ఠుడు తనకు జ్ఞానభిక్ష పెట్టమని ప్రార్థించాడు. వెంటనే పార్వతీ పరమేశ్వరులు అక్కడికక్కడే జ్యోతిః పుంజ రూపంగా మారి వటవృక్షం క్రింద కూర్చున్న దక్షిణామూర్తిలా దర్శనమిచ్చి, వశిష్టునికి కలిగిన మోహాన్ని పోగొట్టి, బ్రహ్మజ్ఞానాన్ని స్థిరపరిచారు. తనను అనుగ్రహించిన ఆ స్థలంలో వెలిసి భక్తులను అనుగ్రహించమని వశిష్ఠుడు ప్రార్థించగా ఈశ్వరుడు సరేనని అక్కడే నిలిచిపోయాడు. అదే దివ్యమైన శ్రీ కాళహస్తి క్షేత్రము. అక్కడి శివుడు దక్షిణామూర్తి. కనుకనే అక్కడ అమ్మవారు శ్రీ జ్ఞాన ప్రసూనాంబగా వెలిసింది. శ్రీశైలంలో కూడా శ్రీ దక్షిణామూర్తి ఉన్నాడు. దివ్య క్షేత్రమైన కాశీలోని విశ్వనాథుడు కూడా దక్షిణామూర్తయే !

శ్రీ దక్షిణామూర్త్యుపనిషత్తులో ఇలా ఉన్నది – మహర్షులందరూ సమిత్పాణులై మార్కండేయ మహర్షిని సమీపించి, “మహానుభావా ! నీకు నీ ఆత్మస్థితి, చిరంజీవిత్వము, బ్రహ్మానందానుభవము ఏ విధంగా ప్రాప్తించాయి?” అని ప్రశ్నించారు. దానికి మార్కండేయ మహర్షి “పరమ రహస్యమైన శివతత్వ జ్ఞానం వలన” అని సమాధానము చెప్పారు. ఆ ఋషుల ప్రార్థన మేరకు మహర్షి ఇలా వివరించారు –

“యేన దక్షిణాముఖశ్శివః అపరోక్షీకృతో భవతి, తత్పరమ రహస్య శివ తత్వ జ్ఞానమ్ ! యస్సర్వోపరమే కాలే సర్వానాత్మని ఉపసంహృత్య స్వాత్మానందే సుఖే మోదతే ప్రకాశతే వా స దేవః”.
దక్షిణాభిముఖుడగు పరమశివుని ప్రత్యక్షముగా ననుభవించి గ్రహించెడి జ్ఞానమే పరమ రహస్య శివ తత్వ జ్ఞానము. ఈ పరమశివుడే ప్రళయ కాలమందు సమస్తమును తనలో లీనము చేసుకొని తన స్వరూపమైన బ్రహ్మానందము చేతనే ఆనందించుచు ప్రకాశించుచున్నాడు” అని చెప్పి శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్ర రహస్యమును బోధించాడు.

యేన అనగా దేని వలన, దక్షిణాముఖః శివః – దక్షిణ దిశలో కూర్చున్న శివుడు, అపరోక్షీ కృతః భవతి – అనగా అపరోక్షము చేసుకొనబడతాడో, ఆ పరమ రహస్యము శివజ్ఞానము అని చెప్తారు. అపరోక్షము చేసుకోవటము అంటే సర్వత్రా ఉన్న పరమాత్మను మనము పరోక్షంగా ఉన్నాడు, ప్రత్యక్షంగా లేడు అనుకుంటున్నాము. ప్రత్యక్షము అంటే ఇంద్రియాలకు కనిపించేలా, కంటికి కనిపిస్తూ ఉండటము. కంటికి ప్రపంచం కనిపిస్తోంది. కానీ అందులో ఉన్నది ప్రపంచం కాదు, పరమేశ్వరుడు. అంటే పరమాత్మ పరోక్షంగా ఉన్నాడు. అలా పరోక్షంగా ఉన్న పరమాత్మను అపరోక్షం చేసుకోవాలి, అనుభవించాలి. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు “అపరోక్షనుభూతి” అనే ప్రకరణ గ్రంథంలో “ఆత్మ తత్వము పరోక్షము కాదు అపరోక్షమే!” అని నిరూపించారు. ఆ పరతత్వమే ఉన్నది అని చెప్పటానికి అపరోక్షము అని చెప్పారు. శ్రీ దక్షిణామూర్తి రూప శివుని అపరోక్షం చేసుకోవాలి. పరమ రహస్యము అని ఎందుకన్నారు అంటే అంతటా ఉన్నా, అది మన అనుభవంలోనికి రావటం లేదు కనుక ! మనము ఇంద్రియాలతో, మనసుతో దేనిని గ్రహించలేమో, దేనిని కేవలము పరమాత్మ అనుగ్రహంతో అనుభవముతోనే గ్రహించగలమో, అది రహస్య విద్య. ఆ శివ రహస్య జ్ఞానము శివుని అనుగ్రహం వల్లే కలుగుతుంది.

భుక్తి ముక్తులను అనుగ్రహించే దక్షిణామూర్తిని ప్రతి ఒక్కరూ దర్శించాలి, ధ్యానించాలి. దక్షిణ అంటేనే సమర్థత కదా ! మనకు ఏ సమర్థత కావాలన్నా అనుగ్రహించేది దక్షిణామూర్తే ! దాక్షిణ్యాన్ని చూపించే మూర్తి దక్షిణామూర్తి. దాక్షిణ్యము అంటే కూడా సమర్థత. దాక్షిణ్యము అంటే దయ. దయ దాక్షిణ్యము ఉండాలి, అంటాము. దయ అంటే జాలి, కరుణ, ఇతరుల బాధలకు స్పందించటము, మేలు చేయాలని, వారి దుఃఖాన్ని పోగొట్టాలని కోరుకోవటము దయ. కానీ దయకు ఎదుటివారి బాధలను తొలగించే శక్తి ఉండదు. దాక్షిణ్యము అంటే “దక్షిణస్య భావం దాక్షిణ్యమ్.” ఏ దయ ఎదుటివారి దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించ గలుగుతుందో, దాని పేరే దాక్షిణ్యము. అదే సమర్థత. అది కలవాడు దక్షిణామూర్తి. సర్వప్రాణికోటి యొక్క సమస్త దుఖాలను సంపూర్ణంగా పోగొట్టగలిగిన సర్వ సమర్ధుడు శ్రీ గురు దక్షిణామూర్తి. నిజమైన పెద్ద దుఃఖము సంసార దుఃఖమే ! సమస్త జ్ఞానములను అనుగ్రహించగల దక్షుడైన మేధా దక్షిణామూర్తి జనన మరణ రూప సంసార దుఃఖం నుండి మనలనుద్దరించి శాశ్వత ఆనందమును కలిగించగలిగిన సమర్థుడు. అటువంటి జ్ఞానమూర్తి, జ్ఞానప్రదాత శాశ్వతానంద ప్రదాత అయిన శ్రీ దక్షిణామూర్తిని దర్శించి, ధ్యానించి, సేవించి మనలోని అజ్ఞానమును పోగొట్టుకొని, ఆత్మజ్ఞానమును పొంది తరించుదును గాక !

బాల్యములోనే శ్రీ దక్షిణామూర్తి మంత్రమును పొంది, పఠించే వారు బుద్ధిని, జ్ఞానమును, మేథస్సును పొందుతారు.

” ఓం నమో భగవతే దక్షిణామూర్తయే ! మహ్యం మేథాం, ప్రజ్ఞాం, యశః, శ్రియం ప్రయచ్ఛ స్వాహా!”

🙏🙏ఓం తత్ సత్🙏🙏

రచన :
డా.సోమంచి(తంగిరాల)విశాలాక్షి.
996 396 4033