Skip to content Skip to footer

सर्वे जनाः सुखिनो भवन्तु

सत्यं वद । धर्मं चर

సంక్రాంతి సంబరాలు

 

By Dr. T(S) Visalakshi

అది ఒక పల్లెటూరు.
హరిత శోభిత సుందర సీమ.
సంక్రాంతికి రమ్మని పిలువనంప,
మనమందరమేగితి మచటి కిప్పుడే !
పొగబండి దిగగానే, ఎదురొచ్చి తెగమెచ్చి
రెండెడ్ల బండిలో నెక్కించుకొనగ,
ఇటు నటుడు జూచుచు
నబ్బుర పడుచుండ
సాగుచుండెను బళ్లు వరి చేలమధ్య.

నా బాల్యపు రోజులు మెదిలె మదిలో ….
నేలను దుక్కి దున్ని వరి నాట్లిడి,
వరి మళ్ళలోపలన్ కలుపును తీసి,
పండిన పంటంత చక్కగ తెగ కోసి,
వరి రాశిగా పోసి, కుప్ప నూర్చి,
ధాన్యరాశులు గృహమ్ముల చేర,
నపార సంతసమ్మొప్పగ,
ధాన్యరాశి కడుపు నేరిమి రోళ్ళ నింపి,
రోకళ్ళతొ చక్కగ పోటు పెట్టి,
జవరాండ్రు దంచెదరు, చెరిగి పోసెదరు,
తాల్చెదరింకను నేమి పోసెదర్.
జల్లెడ త్రిప్పుచు తౌడు నూకలన్ వేర్పరచి,
నల్కలనేరి యేరి, తిత్తిరీలను తెగ తీసి,
పరిశుభ్రము చేసి, బంగరు బియ్యము కుప్ప చేసి,
నింపెదరు సంచుల నిండుగ
బియ్యమియ్యెడన్.

మరి నేడు –
ఈ పనులన్నియు చేయును యంత్ర రాజులే !!

మా ఎడ్ల బండి పయనము కడు రమ్యము మాకు నిపుడు,
పరికించుచు చనుచుంటిమి.

కళ్ళాపు జల్లి యలికిన ఇంటి వాకిళ్ళ యందు
తరుణీమణు లెలదిశలన్
ముత్యాల ముగ్గులు వేసిరి,
మనోహరమగు రంగులతో
తీర్చిదిద్ది రధికోత్సుకతోన్.

గోమయమ్ముతోడ గొబ్బెమ్మలను చేసి,
రంగవల్లుల మధ్య వాటి నుంచి,
పసుపు కుంకుమ చల్లి, పూలతో పూజించి,
వాటి చుట్టు రేగిపండ్లు వైచి,
చెరుకు ముక్కల తోడు బంతిపూవుల తోడ
నలరారు గొబ్బిదేవుళ్ళ కారతిత్తురు – కావుము చల్లగ మమ్ము దీవించుమనుచు.

కురుచగు నెద్దుదెచ్చి, కడు చక్కగ శిక్షణనిచ్చి , తలనూపుట, కాళ్ళనెత్తి నర్తించుట నేర్పి,
కాళ్ళకు గజ్జెలు కట్టి,
కొమ్ములకు, మెడకును భూషణమ్ముల నమరించి,
మూపుపై శాల్వలు కప్పి,
చిత్రపు రంగు వస్త్రములు మేన నమర్చి,
గంగిరెద్దును కడు శ్రధ్ధ చేసి,
డోలు వాయించుచు, బాకా ఊదుచు, వీధుల ద్రిప్పుచుండ,
డూడూ డూడూ బసవన్నా ! యన,
తల యూచుచు చిత్రపు చేష్టలం జేయు బసవన్నను గని,
జనులాదరమొప్ప
నూత్న పురాతన వస్త్రజాలముల్
మెండుగ కప్పి,
గంగెద్దుల వానికిత్తురు విత్తమాసక్తి తోడ,
ప్రణుతింతురు బసవని,
నిక్కము ఈశ్వరుడే గద వృషభరాజగున్ !!

అంబ పలుకు జగదంబ పలుకు ననుచును,
చేత డమరుకమూని
జోస్యంబు చెప్ప నరుదెంచె
బుడబుక్కలవాడొకండు.

హరిలొ రంగ హరీ హరిలొ రంగ హరీ యనుచు,
చిందులిడు సాతానిజియ్యరొకడు,
ఇంటింటి ముంగిట నిలచినాడు.

తలపైన నొకరాగి అక్షయపాత్రతో,
కాలికి ఘల్లుఘల్లను గజ్జెలను కట్టి,
రెండు చేతులలోన చిరుతలను పట్టుకొని,
శ్రీ హరి కీర్తించు హరిదాసు వచ్చె !!

చూడనీశ్వరు దలపించు రూపమునను,
నుదుట విభూతి రేఖల నలదుకొనిన,
చేత శంఖము పూని, ఓంకార ధ్వని తోడ,
హరహర నాదమ్ము చేయు జంగమ దేవ రొకడు – అదిగొ, కనుము.

ఇంటికి చేరిన అతిథుల నెంతో ఆదరమున, స్వాగతించి, గారవించి,
ప్రత్యేక పిండివంటల,
షడ్రసోపేత భోజనము పెట్ట,
మది తుష్టి చెందితిమి మేమందరమున్.

సంక్రాంతికి కొలువగావలె బొమ్మల రూపున సర్వ దేవతల ననియెడి
భావనాపటిమ,
భామినులందరు వేడ్కతోడ,
కడు నేర్పరులై అమర్చిరి
బొమ్మల కొల్వులు,
గృహాగతు లచ్చెరు వొందగ సుందరంబుగన్.

కలియుగమందు నీ బొమ్మల కొల్వున కారతిచ్చి,
పసిపిల్లల కింపుగ తీపి పెట్ట
వంశమ్మభివృధ్ధి చెందునని,
బ్రహ్మయె చెప్పె, మహీపతి కెప్పుడొ
కూర్మి తోడుతన్.

భోగిమంటలు, కోళ్ల పందాల్,
ఎనుముపోతుల పోరు హోరులు
చెప్ప దరమే, బహువిశేషాల్.

మూడు రోజుల పండగిది
బహు ముచ్చటైనది, ముఖ్యమైనది
పెద్ద పండగ ఆంధ్ర జనులకు,
ప్రకృతి మాత – మానవాళి – జంతు తతికి – ఉన్న బంధం
చాటి చెప్పే గొప్ప పండుగ.
హైందవోత్కర్ష తెలిపే
సంక్రమణ పండగ – సంక్రాంతి – నవ్య సంక్రాంతి.

జై హంద్.

రచన :
డా.ఎస్.(టి)విశాలాక్షి.
విశ్రాంత సంస్కృతాచార్య
తెలంగాణ ప్రభుత్వము
సెల్ నంబర్ –
996 396 4033

🙏భోగి పండుగ విశిష్టత🙏

భోగి అంటే భోగము – భోగమును అనుభవించేవాడు భోగి. అతను మహా యోగి, ఇతను మహా భోగి అంటుండటం వాడుకలో గమనిస్తాము. భోగమును అనుభవించమని ప్రబోధించే పండుగ భోగి పండుగ.

మన మహర్షులు దివ్య జ్ఞానము కలిగి, కాలంలో జరిగే మార్పులను గమనించి, ఖగోళంలో జరిగే మార్పులను తెలుసుకుని, ఆయా సమయాల్లో మనం ఏ విధంగా ప్రవర్తించాలో, దైవాన్ని ఎలా ఆరాధించాలో, ఏమేమి చెయ్యాలో తెలియజేస్తూ మనకు అనేక పండుగలను, పర్వ దినములను ఏర్పరిచారు. ఏ కాలంలో దైవ శక్తి ప్రకటీకృతమై ఉంటుందో ఆ కాలాన్ని పండుగగా జరుపుకోమన్నారు మహర్షులు.

ఈ సంక్రాంతి పండుగ గోవులకు, ప్రకృతికి, పరమాత్మకు, పల్లెలకు, పొలాలకు, పంటలకు, మానవులకు సంబంధించిన పండుగ. మన సంస్కృతికి సంప్రదాయాలకు, ప్రకృతి ఆరాధనకు, కృతజ్ఞతా ప్రకటనకు సంబంధించిన పండుగ.

మనది – హైందవులది వ్యవసాయ ప్రధానమైన దేశము. పంటలు చేతికొచ్చి, ఫలసాయం అందినందువల్ల దానిని పది మందికీ పంచుతూ అనుభవించటం అన్నది ఆంధ్రులకు పెద్ద పండుగ అయిన, భారతీయులందరితో ఆచరించబడే పండుగగా జరుపబడుతున్నది. ప్రకృతిలో జరిగే గొప్ప మార్పు సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించటము. దీనినే మకర సంక్రమణము, ‘మకర సంక్రాంతి’ పండుగ అంటాము. ఈ మకర సంక్రమణం ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలను సమర్పిస్తూ కృతజ్ఞతలు ప్రకటించ వలసిన ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన రోజు. దైవారాధన – సూర్యారాధన చెయ్యవలసిన రోజు. దీనికి ముందు రోజు భోగి పేరున భోగము పొందాలని కోరుతూ పండుగ చేస్తాము, దాని తరువాతి రోజును ఇంతటి పాడిపంటల నందించినందుకు కృతజ్ఞతగా గోవృషభములను, ప్రకృతిని ఆరాధిస్తూ ‘కనుమ’ పేరున పండుగ జరుపుకుంటాము.

ఈ మూడు రోజులు కలిసి సంక్రాంతి పండుగ. కనుక ఈ మూడు రోజులలోను కొన్ని విధి విధానాలను సమానంగా మూడు రోజులు పాటిస్తాము.

సంక్రాంతి పండుగకి నెల రోజుల ముందు నుంచే, ధనుర్మాసమంతా ఇంటి ముందు గోమయంతో కళ్ళాపి చల్లి, రంగవల్లులు తీర్చి దిద్ది, ఆ ముగ్గులలో గొబ్బెమ్మలను పెడతాము.

అయితే ఈ పండుగ మూడు రోజులూ విశేషమైన రంగవల్లులు తీర్చి దిద్ది, గొబ్బెమ్మలను పగలు పెట్టి, సాయంత్రం సందె గొబ్బెమ్మలను పెడతాము. వాటి చుట్టూ ఆడవారందరూ చేరి, గొబ్బిళ్ళ పాటలు పాడుతూ, గొబ్బెమ్మల చుట్టూ ఆడటము మరొక విశేషము. ఆ సమయంలో అనేకమైన గొబ్బి పాటలు శ్రీకృష్ణ పరంగా పాడతారు.

“గొబ్బియళ్ళో సఖియా వినవె, చిన్ని కృష్ణుని చరితము గనవె,
చిన్ని కృష్ణుని మహిమను గనవె ….. “

“కొలని గోపనికి గొబ్బిళ్ళో, యదుకుల స్వామికి గొబ్బిళ్ళో,
కొండ గొడుగుగా గోవుల కాచిన, కొండొక శిశువుకు గొబ్బిళ్ళో ….. “

“ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే !
మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే….. “

“సుబ్బీ సుబ్బమ్మ! శుభము నీయవె !
తామర పువ్వంటి తమ్ముణ్ణీయవె !
చామంటి పువ్వంటి చెల్లెల్నీయవె !… “

ఈ పాటలోనే పెళ్ళి కాని అమ్మాయిలు -“మొగలి పువ్వంటి మొగుణ్ణీయవె” – ఆని కలుపుతారు.

ధనుర్మాసం లోను, పండుగ రోజులలోను ఇంటి ముందుకు వచ్చిన గంగిరెద్దుల వారిని, హరిదాసులను, జంగమ దేవరలను మొదలైన వారినందరినీ కొత్త ధాన్యమును, ధనమును ఇచ్చి సత్కరిస్తాము.

ఇంట్లో బొమ్మలకొలువు పెట్టి పేరంటం చేస్తాము. పిండివంటలు చేసి అందరికీ పంచిపెడతాము.

ఇవన్నీ చేస్తూ, విశేషంగా చెయ్యవలసిన వాటిని ఆయా రోజులలో చేస్తాము.

ఈ పండుగలో ఏ రోజు విశిష్టత ఆ రోజుదే అయినా, భోగి పండుగ నాడు మనమందరమూ ఆచరించే విశేషమైన అంశాలెన్నో ఉన్నాయి.
భోగి పండుగ నాడు మనం ఆచరించే ప్రత్యేకమైన అంశాలు –

  1. ముఖ్యంగా భోగము ననుభవించాలని కోరుకోవటము, భోగము ననుభవించటము.
  2. అసలు భోగము అంటే ఏమిటి ? మనమెలాంటి భోగము ననుభవించాలని కోరుకోవాలి అన్నది తెలుసుకోవటము.
  3. ఎవరు ఏ వ్రతాచరణ వలన ఇటువంటి భోగము ననుభవించారు అన్న దానిని గ్రహించటము. శ్రీ గోదా రంగనాథ స్వామి కల్యాణము నాచరించటము లేదా దర్శించటము.
  4. భోగి మంటలు వెయ్యటము.
  5. భోగి పళ్ళు పొయ్యటము.

భోగి పండుగ మానవులందరినీ భోగము ననుభవించమని, ఆనందంగా ఉండమనీ చెప్తోంది. పరమాత్మ పంచభూతాత్మకమైన, భోగ స్వరూపమైన ప్రకృతిని సృష్టించి, ఆ సృష్టిలోని భోగాలను ఎలా అనుభవించాలో ఆ జ్ఞానాన్ని విధి నిషేధ రూపమైన వేద విజ్ఞాన రూపంగా అనుగ్రహించాడు. మనం వాటిని గ్రహించి, ఆ నియమాలను పాటిస్తూ భోగాల ననుభవించాలి.

అసలు భోగం అంటే ఏమిటి అంటే ఆనందానుభవం అని చెప్పవచ్చును. మనకు మూడు రకాల భోగాలున్నాయి.

  1. భౌతికమైన, లౌకికమైన భోగములను అనుభవించటం. భౌతిక భోగాలు అనేక రకాలుగా ఉంటాయి. వేదోక్త ఆయుర్దాయాన్ని కలిగి, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి, ఇంద్రియ భోగాలననుభవిస్తూ, పేరు ప్రతిష్ఠలను పొందుతూ, ధన కనక వస్తు వాహనాదుల, బంధుమిత్రుల, సేవకుల భోగాన్ని పొందటం. వీటన్నింటి కంటే మించిన నిజమైన భోగం ఉన్న దానితో సంతృప్తిగా ఆనందంగా ఉండటాన్ని అలవరచుకోవటం. అదే అసలైన భోగము.
  2. చక్కని కర్మాచరణ ద్వారా స్వర్గాది లోకాలను, హిరణ్యగర్భ లోకాన్ని పొందే ప్రయత్నం చేస్తూ పారలౌకికమైన భోగాన్ని అనుభవించటం. దాని కొరకు ధ్యాన, దాన, జప, తప, హోమాదుల ద్వారా, అగ్ని ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందుతూ, సాత్విక గుణముల నలవరచుకుని దైవీ సంపదను వృద్ధి చేసుకోవాలని గ్రహించాలి. “స్వర్గ కామో యజేత” కనుక యజ్ఞ యాగాదుల నాచరించి, ఆ భోగాలను పొందటానికి ప్రయత్నించటం భోగమే !
  3. నిజమైన భోగము మానవ జీవిత పరమ గమ్యమైన పునరావృత్తి రహితమైన శాశ్వతానందమును నిశ్శ్రేయస్సును అనగా మోక్షమును పొందటము. దానికి భగవద్గీతలో చెప్పిన నిష్కామ కర్మ యోగాన్నాచరిస్తూ, శ్రీమద్భాగవతములో చెప్పిన అనన్య భక్తిని, ఏకాంత భక్తిని పొందటానికి సాధన చేస్తూ, భారతంలో చెప్పిన నైతిక జీవనాన్ని అలవరచుకుని, శ్రీమద్రామాయణములోని శ్రీ సీతారాముల నాదర్శంగా తీసుకుని జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ, సద్గురువుల బోధతో, శాస్త్ర పఠనంతో, శ్రవణ మనన నిదిధ్యాసనల ద్వారా అసలైన జ్ఞానము పొందటం నిజమైన భోగము. అందరూ అలాంటి శాశ్వతానందా న్ననుభవించటానికి ప్రయత్నం చేసి, ఆ ఆనందాన్ని అనుభవించటమే భోగము.

భోగి పండుగ మనను ఇలాంటి భోగాలను అనుభవించమనీ, ఆ అనుభవం కొరకు ప్రయత్నించమని చెప్తోంది.

ఇలాంటి భోగాలను అనుభవించిన వారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే, మన వాఙ్మయంలో, లోకంలో ఇలాంటి అమందానంద భోగాన్ని అనుభవించినవారు ఎందరో ఉన్నారని తెలుస్తోంది. అయినా ఈ పండుగ సందర్భంలో మనం అలాంటి పరమాత్మ సాన్నిధ్య భోగాన్ని పొందిన గోదాదేవిని స్మరించుకుని భక్తిని ప్రకటిస్తాము.

అది ఏ వ్రతాచరణ వలన ఆమె పొందిందో గ్రహించి, మనము కూడా అలా ఆచరించి, పొందటానికి ప్రయత్నించాలి.

గోదాదేవిని ఆండాళ్ తల్లి అంటారు. ఈ తల్లి శ్రీ రంగనాథ స్వామిని భర్తగా పొంద గోరి, శ్రీకృష్ణ పరమాత్మను పతిగా పొందగోరి గోపికలందరూ ఆ కాలంలో ఆచరించిన కాత్యాయనీ వ్రతాన్నాచరించిన గోపికలను ఆదర్శంగా తీసుకుని, తాను ధనుర్మాసం నెల రోజులు మార్గళీ వ్రతాన్నాచరించి, తిరుప్పావై పాశురాలతో స్వామిని కీర్తించి, పరమాత్మ అనుగ్రహం పొంది, మహా పర్వ దినమైన భోగినాడు శ్రీరంగనాథ స్వామిని వివాహం చేసుకుని, పరమమైన భోగాన్ని పొందింది.

జీవుడు దేవుని చేరటమే నిజమైన భోగము. భగవదనుగ్రహం పొందటం, భగవదనుభవాన్ని పొందటమే మానవుల కందరికీ నిజమైన భోగము.

మనం భోగి పండుగ నాడు శ్రీ గోదా రంగనాథ స్వామి కల్యాణము జరిపించి, దర్శించి ఆనందిస్తాము.

గోదా దేవి అంటే గో తత్త్వాన్ని ఇచ్చే తల్లి. గో అంటే గోవులు, గోపికలు, సూర్య కిరణాలు, భూమి ఇలా అనేక అర్ధాలున్నాయి. దా – యచ్ఛ్ అనే ధాతువునకు ఇవ్వటం అనే అర్ధం ఉంది. గోదాదేవి తనను గోపికగా భావించుకుని, శ్రీ రంగనాథ స్వామిని శ్రీ కృష్ణునిగా భావించి, గోపికలు శ్రీ కృష్ణుని పొందినట్లుగా తాను శ్రీ రంగనాథ స్వామిని భర్తగా పొంది మనకు ఆదర్శమైంది.

భోగి పండుగ నాడు సూర్యోదయానికంటే చాలా ముందే ఇంటిల్లిపాదీ నిద్ర లేచి, ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని, అందరూ కలిసి ఆరుబైటకు చేరి, భక్తితో భోగిమంటలు వెయ్యటం అన్నది మనకి అనాదిగా వస్తున్న సంప్రదాయం.

మనం అగ్ని ఆరాధకులము. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమనీ ప్రార్ధిస్తూ అగ్నిహోత్రుని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలేమైనా ఉంటే వాటిని, మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో – జ్ఞానాన్నిలో వేసి దగ్ధం చేసుకోవటం, భోగాన్ని, మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం.

ఈ అంతరార్థం తెలీనివారు, విపరీతంగా గడగడ వణికించే చలిని కాచుకోవటానికి చలిమంటలను భోగి మంటలుగా వేస్తున్నారని భావిస్తారు.

కాస్త జ్ఞానం కలవారు, ఈ రోజుతో చలి వెళ్ళి పోతోంది. సూర్య భగవానునిలోని తేజస్సు పెరగబోతోంది, వృద్ధి అవుతుంది అనే భావనతో భోగి మంటలు వేస్తారు.

భోగిమంటల కోసం ముందు దైవ నామ స్మరణ చేస్తూ, ఆవు పేడ పిడకలను, సమిథలను పెట్టి, కర్పూరంతో అగ్నిని రగిలిస్తారు. అగ్ని దేవుని ప్రార్ధిస్తారు. ఆ మంటలు కాస్త పెరిగాక, ఇంట్లో ఉన్న పాత సామాన్లను, అక్కర్లేని చెక్క ముక్కలను అన్నింటినీ ఆ మంటల్లో వేస్తారు. అంటే అక్కర్లేని చెత్తను వదిలించుకుని కొత్తదనాన్ని కోరటం కనిపిస్తుంది. కాని దీని అంతరార్ధం ఏమిటంటే, బాధ కలిగించే అక్కర్లేని ఆలోచనలను, రాగద్వేషాది దుర్గుణాలను, కోపతాపాలను అగ్నిలో దగ్ధం చెయ్యాలి, వదిలెయ్యాలి అని గ్రహించటం. అందరితో సౌమనస్యంతో ఉండాలని నిర్ణయించుకోవటం.

భోగిమంటల వల్ల మనకు కలిగే మరొక లాభమేమిటంటే, ఈ భోగి మంటలలో ఆవు పేడ పిడకలను, సమిథలను వెయ్యటం వలన అవి కాలుతున్నప్పుడు వచ్చే ధూమము వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. పిల్లలందరూ ఈ భోగి మంటలను ఉత్సాహంగా చేస్తారు, ఎంతో ఆనందిస్తారు.

భోగి పండుగ నాడు శ్రీ సూర్య నారాయణ స్వామిని, కుల దైవాన్ని, ఇష్ట దైవాన్ని, శ్రీ కృష్ణ పరమాత్మను, త్రిలోకాధిపతియై, సకల భోగాలను అనుభవిస్తున్న దేవేంద్రుని ఆరాధించి, కొత్త బియ్యంతో వండిన పొంగలి, పరమాన్నాలను దేవతలకు నివేదించి, ఆ ప్రసాదాన్ని మనం తినాలి.

భోగి పండుగ నాటి విశేషం పిల్లలకు భోగి పళ్ళు పొయ్యటం.
భోగి పండుగ నాడు ముత్తైదువులను ఇంటికి పిలిచి, ఇంటి పెద్దలందరూ కలిసి ఇంట్లో ఉన్న ఐదారు సంవత్సరాల లోపు పిల్లలకు దృష్టి దోషం తగలకుండా దిష్టి తీస్తూ, భోగిపళ్ళు పోసి, సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తారు. మంగళ హారతి నిస్తారు. ఇది మన సంప్రదాయం.

కనుక భోగిపళ్ళు పొయ్యటం వెనక అంతరార్థం దృష్టి దోషం పరిహరించటం, చెడు సోకకూడదని కోరుకోవటం, శుభం కలగాలని ఆశీర్వదించటం. ఇదే వేదంలో చెప్పిన ఇష్ట ప్రాప్తి, అనిష్ట పరిహారం. దీనిని పసితనం నుంచే పిల్లలకు నేర్పిస్తున్నామన్నమాట.

రేగు పళ్ళనే భోగి పళ్ళు అంటాము. భోగిపళ్ళు పొయ్యటానికి రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, పచ్చదనాన్ని కోరుతూ పచ్చి శనగలను అంటే హరిబూట్ గింజలను, గురు గ్రహ అనుగ్రహం కోసం నానబెట్టిన శనగలను, దిష్టిని పోగొట్టే కొన్ని ద్రవ్యాలను, వక్కల లాంటి నల్లని గింజలను, కలిపి, శుభమును కలిగించే చామంతి, గులాబీ, బంతిపూల వంటి పూరేకలను, అక్షతలను, రాగి నాణాలను లేక చిల్లర నాణాలను అన్నింటినీ కలిపి రెండు చేతులతో తీసుకుని, పిల్లలను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వారికి పైనుంచి క్రిందికి దిగతుడిచి, తరువాత గుండ్రంగా సవ్యంగా, అపసవ్యంగా పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ “ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయిన వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి, మంచివాళ్ళ దిష్టి, చెడ్డవాళ్ళ దిష్టి, ఎంత అందంగా ఉన్నారనే వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాలి” అంటూ వారి తల మీద పొయ్యాలి. అలా దిగతుడవటం వల్ల పిల్లలకు ఏదైనా దిష్టి తగిలితే, అది తొలగిపోతుంది. తరువాత భగవదనుగ్రహంతో దీర్ఘాయుష్మంతులై, నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, సద్గుణాలతో, సద్బుద్ధితో, నైతిక విలువలతో వర్ధిల్లుతూ, విద్యనార్జిస్తూ ఎదగాలనీ, వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించాలి.

భోగిపళ్ళు పోసేటప్పుడు అనేకమైన గొబ్బి పాటలు పాడతారు.
“చిట్టి చిట్టి రేగుపళ్ళు,
చిట్టి తలపై భోగిపళ్ళు,
ఎంతో చక్కని భోగిపళ్ళు,
ఎర్ర ఎర్రని రేగుపళ్ళు….. ” అంటూ పాడతారు.

అందరూ పరస్పరం ప్రేమ భావంతో, సామరస్యంతో అందరిళ్ళల్లో ఉన్న పిల్లలకు భోగిపళ్ళు పోసి ఆశీర్వదించటం మన సంప్రదాయం.

కాలమంతా దైవ స్వరూపమే అయినా, ఏ మంచి సమయంలో ఎటువంటి మంచి పనులను చేస్తే, అఖండమైన మంచి జరుగుతుందో మన మహర్షులు చెప్పారు. దానిని ఆచరిస్తూ మనమందరమూ సమస్త సన్మంగళములను పొందుదుము గాక !!

      స్వస్తి.

రచన :
డా.సోమంచి(తంగిరాల)విశాలాక్షి
విశ్రాంత సంస్కృతాచార్య
తెలంగాణ ప్రభుత్వము
సెల్ నంబర్ – 996 396 4033

🙏🙏🙏నవ్య సంక్రాంతి 🙏🙏🙏

దృతే దృయహమా మిత్రస్య మా చక్షుషా
సర్వాణి భూతాని సమీక్షంతాం !
మిత్రస్యాహం చక్షుషా సర్వాణి భూతాని సమీక్షే !
మిత్రస్య చక్షుషా సమీక్షామహే !!
యజుర్వేద మంత్రం – 3.6.18

హే పరమాత్మా ! మాకు సమదృష్టిని ప్రసాదించు. అన్ని ప్రాణుల వైపు ప్రేమ నిండిన కన్నులతో, కరుణతో కూడిన హృదయంతో మేము చూడ గలుగుదుము గాక ! మా పట్ల ఇతర ప్రాణులన్నీ స్నేహపూరిత దృక్కులనే ప్రసరించు గాక !
ఈది యజుర్వేద మంత్రములో మహర్షులు చేసిన ప్రార్ధన. ఇంతటి మహోన్నత ఆశయం కలిగిన మన మహర్షులు ఏర్పరచిన పండుగలలో మనకు అత్యంత ప్రధానమైన పండుగ “సంక్రాంతి పండుగ.”

‘సం’ అంటే ‘సమ్యక్’ – మంచి, చక్కని. ‘క్రాంతి’ అంటే మార్పు. సమ్యక్ క్రాంతి – సంక్రాంతి.

‘సంక్రాంతి’ లేక ‘సంక్రమణం’ అంటే – ‘చేరుట’ అని అర్ధం.
“జయసింహ కల్పద్రుమం” అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా నిర్వచించారు –
“తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః”.

మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే శ్రీ సూర్య భగవానుడు ముందున్న రాశి నుండి తరువాత రాశి లోనికి ప్రవేశించటమే సంక్రాంతి.

 సృష్టి ప్రారంభమైనప్పటి నుంచే సృష్టిలో జరిగే, ఖగోళంలో జరుగుతున్న మార్పులను కేవలం దివ్య దృష్టితో, తపశ్శక్తితో గ్రహించారు మన మహర్షులు. ఆ మార్పులను బట్టి సంవత్సరాన్ని ఉత్తరాయణము, దక్షిణాయనము అని విభజించారు. ప్రతి నెలా ఒక సంక్రాంతి ఏర్పడుతుందని గుర్తించారు. అంటే, ప్రతి నెలలో సూర్యుడు రాశులు మారుతుంటాడు. అలా మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, మిథున సంక్రాంతి మొదలైన పన్నెండు సంక్రాంతులు ఏర్పడతాయి. వాటిలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్య కాలాన్ని "మకర సంక్రాంతి పండుగ" గా జరుపుకుంటున్నాము. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి, అక్కడి నుంచి కుంభరాశిలో, అలాగే మీన, మేష, వృషభ, మిధున రాశులలో కొనసాగినంత కాలం 'ఉత్తరాయణము'. మిగిలిన ఆరు రాశులలో అనగా కర్కాటక రాశిలో ప్రవేశించి, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనూరాశులలో కొనసాగినంత కాలం 'దక్షిణాయనం' అంటారు. 

సూర్యభగవానుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి మారటం వలన ప్రకృతిలో కూడా ప్రతి నెల స్పష్టమైన మార్పు వస్తుంది. ఈ మార్పు మానవ జీవితంపైన మంచి ప్రభావం చూపిస్తుంది.

ఈ మకర రాశిలో ప్రవేశించటాన్నే ఎందుకు పెద్ద పండుగగా జరుపుకుంటున్నాము అంటే, దానికి అనేక కారణాలున్నాయి. అప్పటి వరకు ఉన్న గడగడ వణికించే చలి మకర సంక్రమణంతో తగ్గుముఖం పడుతుంది. వెలుగు ఎక్కువగా ఉండే దీర్ఘమైన పగళ్ళకూ, సుందరమైన, ఆహ్లాదకరమైన కాలానికి నాంది కాగల ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమవుతుంది. దక్షిణాయనంలో పగళ్ళు తక్కువ, రాత్రిళ్ళు ఎక్కువ ఉంటాయి. ఉత్తరాయణంలో పగళ్ళు ఎక్కువ, రాత్రిళ్ళు తక్కువ ఉంటాయి. ప్రకృతిలో ఇది గొప్ప మార్పు. ఆనందకరమైన, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని కలిగించే మార్పు. మన ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగటి కాలం. అందువల్ల కూడా ఉత్తరాయణం అత్యంత పవిత్రమైన కాలం. దక్షిణాయనం దేవతలకు రాత్రి. దక్షిణాయనం సాధనా కాలం. ఆ కాలంలో ఎక్కువగా ధ్యానాలు, జపతపాలు, పూజలు, ఉపాసనలు చేస్తారు. ఉత్తరాయణ పుణ్య కాలములో శ్రీ సూర్య నారాయణ స్వామిని పూజించే రథసప్తమి నుంచి సూర్యుని రథ గమనంలో మార్పు వల్ల ఎండ వేడిమి నెమ్మదిగా పెరగటం ప్రారంభమవుతుంది. స్వచ్ఛంద మరణ వరం కలిగిన శ్రీ భీష్మాచార్యుల వారు అంపశయ్యపై ఉండి కూడా ఉత్తరాయణ పుణ్య కాలం కోసం వేచి ఉన్నారు.

ఉత్తరాయణంలోనే మనం ఉపనయనాలు, వివాహాది శుభ కార్యాలను జరిపిస్తాము. కనుకే ఉత్తరాయణం ప్రారంభంలో వచ్చే మకర సంక్రమణాన్ని “సంక్రాంతి పండుగ”గా జరుపుకుంటున్నాము. వెలుగుకు, జ్ఞానానికి సూచకమైన ‘మకర సంక్రాంతి’ మనకు పెద్ద పండుగ.

సాధారణంగా మనం పండుగలకు చాంద్రమానాన్ని పాటిస్తాము. కనుక తిథులను బట్టి ఆయా పండుగలను జరుపుకుంటాము. కానీ సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాము కనుకే ప్రతి సంవత్సరము కూడా జనవరి 13, 14, 15, 16 తేదీలలోనే ఈ పండుగ మూడు రోజులు ఉంటాయి. ఆంధ్రులకు పెద్ద పండుగలలో ఒకటి సంక్రాంతి పండుగ. ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగగా జరుపుకుంటాము. కనుమ మర్నాడు ముక్కనుమగా కూడా పండుగ చేస్తాము.

మనకు అనేకమైన పండుగలున్నాయి, పర్వదినాలున్నాయి. వేటి ప్రాముఖ్యత వాటిదే ! అయినా సంక్రాంతి పండుగ మటుకు అత్యంత విశిష్టమైనది. మన సనాతన సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియజేస్తూ, ఆరోగ్యాన్ని కలిగించే, ఆయుష్షును వృద్ధి పరిచే ఎన్నో అంశాలతో కూడి ఉంటుంది ఈ పండుగ. ప్రకృతి, జీవుడు, దేవుడు, పశుపక్ష్యాదులు సర్వము యొక్క సమైక్యతను నిరూపిస్తూ, ఆధ్యాత్మికతను కలిగిన గొప్ప పండుగ సంక్రాంతి పండుగ.

మనది వ్యవసాయ ప్రధానమైన దేశము. ఏడాది కష్టపడి పని చేసినందుకు ఫలితంగా ధాన్యపు రాశులు ఇంటికి వచ్చిన ఆనందంతో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.

ప్రతి సంక్రమణమునందు పితృ తర్పణాలివ్వాలి. విశేషంగా ఉత్తరాయణ పుణ్య కాలమైన సంక్రాంతి పండుగ రోజున తప్పక పితృ తర్పణాలివ్వాలి, పితృదేవతలను స్తోత్రించాలి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రము, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరుకు గడలు, ఉదకుంభం మొదలైనవి దానమివ్వాలి. ఈ కాలంలో చేసే గోదానం వల్ల స్వర్గవాసం కలుగుతుందని చెప్తారు.

సంక్రాంతికి నెల రోజులు ముందు నుంచే ధనుర్మాసమంతా ఆడవారు తెల్లవారుజామునే లేచి ఇళ్ళ ముందు కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టి, గోమయంతో గొబ్బెమ్మలు పెడతారు. నెల రోజులు గొబ్బెమ్మలను పెట్టి, రాధాదేవిని, శ్రీకృష్ణ పరమాత్మను, గోపికలను ఆరాధించిన గోదాదేవికి శ్రీరంగనాథ స్వామితో భోగినాడు కల్యాణం జరిపిస్తారు.

భోగినాడు తెల్లవారు ఝామున భోగిమంటలు వేస్తారు. దుష్ట శక్తులను, అసుర శక్తులను, మనలోని దుర్గుణాలను దగ్ధం చేసి, దైవీ శక్తులను ఆహ్వానించటం, పూజించటం దీని వెనుక ఉన్న పరమార్ధం.

భోగి పండుగ నాడు కొత్త బియ్యంతో పొంగలి వండి, పరమాన్నం చేసి, శ్రీ సూర్య భగవానునికి, కుల దైవానికి, ఇష్ట దైవానికి నివేదించి, ఆ ప్రసాదాన్ని ఇంట్లో అందరూ భుజిస్తారు.

భోగినాడు చిన్న పిల్లలకు దృష్టి దోషం తగలకుండా దిష్టి తియ్యటానికి, పిల్లలు భోగములనుభవించాలని కోరుతూ భోగిపళ్ళు పోస్తారు.

సంక్రాంతినాడు ఇంటి ముందు కళ్ళాపి చల్లి, అందమైన పెద్ద రంగవల్లులను తీర్చి దిద్దుతారు. వాటిమీద గొబ్బెమ్మలు పెట్టి, గుమ్మిడి పూలతో, బంతి పూలతో అలంకరించి, చుట్టూరా రేగుపళ్ళు, చెరుకు ముక్కలు వేసి, మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా, చుట్టూరా ఉన్న గొబ్బెమ్మలను ఆమె చెలికత్తెలుగా భావన చేసి, పసుపు కుంకుమలతో పూజించి హారతిస్తారు.

సంక్రాంతి రోజున గంగిరెద్దులను అందంగా అలంకరించి, ఇంటింటికీ గంగిరెద్దు మేళం తెస్తారు. డోలు సన్నాయి వాయిస్తూ ఉంటే, వాటికి అనుగుణంగా గంగిరెద్దులు నర్తిస్తాయి. “అయ్యవారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు”, అంటుంటే గంగిరెద్దులు మోకాళ్ళ మీద కూర్చుని లేవటం, “డూడూ డూడూ బసవన్నా” అంటుంటే, తలలూపుతూ విన్యాసాలు చెయ్యటం కన్నుల పండుగగా ఉంటుంది. అందరూ గంగిరెద్దును బసవన్నగా భావించి నూతన వస్త్రాలు కప్పుతారు. సన్నాయి వాద్యకారులకు డబ్బులిస్తారు, ధాన్యాన్నిస్తారు.

ఉదయమే శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించబడే హరిదాసు తలపైన రాగి అక్షయపాత్రను కదలకుండా పెట్టుకుని, రెండు చేతులతో చిరతలు పట్టుకుని వాయిస్తూ, నుదిటిన తిరునామం పెట్టుకుని, కాళ్ళకు కంచు గజ్జెలు కట్టుకుని, అవి ఘల్లు ఘల్లుమంటుండగా “హరిలొ రంగ హరీ” అంటూ గానం చేస్తూ, చిందులు వేస్తూ వస్తాడు. అలాగే చిందులేస్తూ, హరినామం గానం చేస్తూ సాతాని జియ్యరు కూడా వస్తాడు. ప్రజలు సంతోషంగా సాక్షాత్తుగా శ్రీహరే తమ ఇంటి ముంగిటికి వచ్చినంతగా ఆనందిస్తూ ఆ రాగి చెంబులో ధాన్యం పోస్తారు. వారిరువురికీ డబ్బులిచ్చి సత్కరిస్తారు.

“అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు” అంటూ చేతిలో డమరుకం పట్టుకుని వాయిస్తూ, జోశ్యం చెప్పటానికి ఇంటింటి ముందుకు బుడబుక్కలవాడు వస్తాడు.

ఈశ్వరుని వలె విభూతి రేఖలు నుదిటి మీద ధరించి, చేతిలో శంఖం పట్టుకుని ఓంకార నాదం చేస్తూ “హర హర మహాదేవ” అంటూ శివ నామ సంకీర్తన చేస్తూ జంగమ దేవర వస్తాడు.

వీరందరూ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు. వీరందరినీ గౌరవిస్తూ, స్వయంపాకాలనిస్తూ, డబ్బులిస్తూ మన సంస్కృతిని సంప్రదాయములను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిదీను. వీరందరూ మనందరినీ ఆయురారోగ్యములతో, భోగభాగ్యములతో విలసిల్లమని ఆశీర్వదిస్తారు.

సంక్రాంతికి ఆంధ్రులు తమ ఇళ్ళల్లో బొమ్మలకొలువును ఏర్పాటు చేసి, బొమ్మలను ప్రతీకగా పరమాత్మను ప్రార్ధిస్తారు. బొమ్మలకు హారతిస్తారు, పేరంటం చేస్తారు. పిల్లలకు పప్పు బెల్లాలు, నువ్వులుండలు ఇస్తారు.

సంక్రాంతి సందర్భంగా గ్రామాలలో కోడిపందాలు, గొర్రెపొట్టేళ్ళ పందాలు, కొన్ని ప్రాంతాల్లో జల్లెకట్టు వంటివి ఆడి ఆనందిస్తారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పిల్లలు, యువకులు అత్యంత ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేసి ఆనందిస్తారు.

సాధారణంగా అందరూ సంక్రాంతి పండుగకు ముందు రోజు అరిశలు, చక్కిలాలు, నువ్వులుండలు, పాలకాయలు, జంతికలు వంటివి చేస్తారు. పండుగ రోజున పరమాన్నం, బొబ్బట్లు, పులిహోర లాంటివి చేస్తారు. అన్నింటినీ దైవానికి నివేదించి, బంధువులకు, ఇంటి చుట్టుపక్కల వారికి, ఇంట్లో పనిచేసే వారికి అందరికీ పంచిపెడతారు.

మనకు పాడిపంటలనిచ్చే గోవులను, ఎద్దులను కనుమనాడు పూజిస్తారు. పుడమి తల్లిని పూజిస్తారు. “కనుమనాడు మినుము తింటే ఎనుమంత బలం వస్తుంది” అంటారు కనుక కనుమ నాడు గారెలు, ఆవళ్ళు చేసి దైవానికి నివేదించి భుజిస్తారు.

మొత్తానికి మూడు రోజులు పిండివంటలు చేసి, దైవారాధన చేసి భక్తిని, పశువులను పూజించి కృతజ్ఞతలను తెలియజేస్తారు. ఇలా కృతజ్ఞతా ప్రకటన చేసే జాతి భారతజాతి అని చెప్పవచ్చును.
“మాతా భూమిః, పుత్రోऽహం పృథివ్యాం” అన్నారు మన మహర్షులు.

ఈ విధంగా పుడమికీ, ప్రకృతికీ, మానవులకూ, గోవృషభములకూ ఉన్న సంబంధాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ మన మకర సంక్రాంతి పండుగ. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజిక పరంగా భారత దేశ ప్రజలందరూ జరుపుకునే గొప్ప పండుగ “నవ్య సంక్రాంతి పండుగ”.

  🙏🙏జై హింద్. 🙏🙏

రచన :
డా.సోమంచి(తంగిరాల)విశాలాక్షి.
996 396 4033.

🙏 కనుమ పండుగ 🙏

మన మహర్షులు ఏర్పరచిన ప్రతి పండుగ వెనుక ఆధ్యాత్మిక పరమైన, సాంఘిక పరమైన, ఆరోగ్య పరమైన ఎన్నో అంశాలు దాగి ఉంటాయి. “ఈశావాస్యమిదం సర్వం” అని నమ్మి ఆరాధించే మనం, మన ప్రతి పండుగ సందర్భంగాను ప్రకృతిని ఆరాధించటం, పశుపక్ష్యాదులను సేవించటం గమనార్హం.

కాలమంతా దైవ స్వరూపమే ! ఏడాది పొడుగునా 365 రోజులు ఏదో ఒక పర్వమో, పండుగో, నియమ పాలన సమయమో అవుతూనే ఉంటుంది. అయినా, ప్రతి నెలలోను కొన్ని ప్రత్యేకమైన రోజులను కాలంలో ఉన్న విశేషాన్ననుసరించి పండుగలుగా విశేషంగా జరుపుకుంటాము. కొన్ని పండుగలు ఒక్క రోజు జరుపుకునేవి అయితే, కొన్ని మూడు రోజులు, కొన్ని ఐదు రోజులు అలా ఉంటాయి. ధనుర్మాసం నెలంతా ఒక విధమైన ఆరాధనైతే, కార్తీకమాసమంతా మరొక విధమైన నియమ పాలనతో కూడిన ఆరాధన. మన సంస్కృతిని సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలను మనమందరం భక్తి శ్రద్ధలతో పాటిస్తూ, మన తరువాత తరాల వారికి అందించ వలసిన బాధ్యత మనందరిదీను.

మన భారతీయులందరూ జరుపుకునే పండుగలలో పెద్ద పండుగ మకర సంక్రాంతి పండుగ అనీ, ఈ పండుగను, మూడు రోజులుగా కానీ, ముక్కనుమతో కలిపి నాలుగు రోజులు కానీ జరుపుకుంటాము అనీ తెలుసుకున్నాము కదా !

భోగి పండుగ గురించి, సంక్రాంతి పండుగ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు కనుమ పండుగ గురించి తెలుసుకుందాము.

ఈ భూమిపై నివసించే 84 లక్షల జీవరాశులలో కేవలం మనము – మానవులము మాత్రమే పండుగలు జరుపుకుంటాము. ఒక్కో పండుగ సందర్భంగా, ఒక్కో వ్రత నియమానికి ఒక్కో విధంగా, కొన్ని కొన్ని జంతువులను, పక్షులను, వృక్షాలను, నదులను, పర్వతాలను ఆరాధిస్తాము, వాటి ప్రాముఖ్యతను గుర్తిస్తాము, గౌరవిస్తాము, అందరికీ తెలియజేస్తాము. పరమశివుని, అరుణాచలేశ్వరుని ఆరాధిస్తూ, అరుణగిరి ప్రదక్షిణ చేస్తాము. శ్రీకృష్ణ స్వరూపంగా గోవర్ధనగిరిని పూజిస్తాము. అన్ని నదులనూ ఎప్పుడూ దైవంగా ఆరాధిస్తూనే, ఏ నదికి పుష్కరాలు వస్తే, ఆ నదిని ఆ సమయంలో విశేషంగా ఆరాధిస్తాము. కాశీ వెళ్ళి వస్తే, కాశీ సమారాధన సందర్భంగా కాలభైరవుని – శునకమును ఆరాధిస్తాము. శరన్నవరాత్రుల సందర్భంగా పాలపిట్ట దర్శనం శుభమంటాము. ప్రతిరోజూ తులసీమాతను ఆరాధిస్తూనే ఉంటాము. ధాత్రీ వృక్షమును పూజిస్తాము. వట సావిత్రీ వ్రతం చేసేప్పుడు వట వృక్షాన్ని ఆరాధిస్తాము. నాగుల చవితికి, నాగ పంచమికి నాగులనారాధిస్తాము. గరుడ పంచమికి గరుత్మంతుడిని – గరుడ పక్షిని ఆరాధిస్తాము. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆవులను, ఎద్దులను విశేషంగా ఆరాధిస్తాము.

విశ్వజనని గోమాతను ఎల్లప్పుడూ పూజిస్తూనే ఉన్నా, కనుమ పండుగ రోజున ఎద్దులనన్నింటినీ, ఆవులను, దూడలను విశేషమైన భక్తి భావంతో, కృతజ్ఞతను ప్రకటిస్తూ పూజిస్తాము. ముఖ్యంగా పంట వేసే ముందు, తర్వాత పంట చేతికందే సమయాల్లోనూ గోవృషభములను ఆరాధించటం అనాది కాలంగా ఉన్నది. అవి కూడా మన జీవితంలో భాగమే అని తెలిపే పండుగ కనుమ పండుగ. కర్షకులకు విశేషమైన పండుగ సంక్రాంతి పండుగ, అందులోను కనుమ పండుగ.

మన వేదములలో కూడా కృషి గోప్రాముఖ్యతలను గురించి అనేక మంత్రాలలో చెప్పారు.

యజుర్వేదములో 36-19 లో –
మిత్రస్యాహం చక్షుషా సర్వాణి భూతాని సమీక్ష్యే
మేము సకల ప్రాణములను మిత్ర దృష్టితో వీక్షింతుము గాక ! అని చెప్పబడినది.

“క్షీరం చాన్నం తథా జ్ఞానం లోకేభ్యో దీయతే యయా !
గోమాతా సా సదా సేవ్యా ధేనుః పృథ్వీ సరస్వతీ !!”
పాలను ఇచ్చునది కావున గోవు మనకు మాత. అన్నమును ఇస్తున్నది కనుక భూమి మనకు మాత. జ్ఞానమొసగునది కనుక సరస్వతి మనకు మాత. సంస్కృత భాషలో ఈ మూడింటిని గోశబ్దముతో చెప్తారు. అందువలన గోవు సర్వదా పూజింపదగినది.

పశు సంపద సకల సంపదలందు ఉత్కృష్టమైనది. అథర్వణ వేదము 17 వ కాండమందు ఈ ప్రార్థనా మంత్రమున్నది –
“త్వం నః పృణీః పశుభిర్విశ్వరూపైః !
సుధాయాం మా ధేహి పరమే వ్యోమన్ !!”
ఓ పరమాత్మా ! నీవు మమ్మల్ని అనేక విధములైన పశుసంపదతో సంతుష్టులను చేయుము. ఈ విశాల ప్రపంచంలో నన్ను అమృతమందు ఉంచుము. వివిధ పశుసంపదతో నన్ను సుఖవంతుని చేయుము.

అథర్వణ వేదము 3-17-1 లో కృషి సంపద గురించి ఇలా చెప్పారు –
“సీరా యుంజంతి కవయో యుగా వితన్వతే !
పృథక్ ధీరా దేవేషు సుమ్నయౌ !!”
బుద్ధిమంతులు, జ్ఞానులైనవారు ఎద్దుల మెడపై కాడినుంచి, నాగలితో నేలను దున్నుతారు. యావత్ప్రపంచ ప్రజల కొరకు ఆహారధాన్యములను ఉత్పత్తి చేస్తారు.

మనది వ్యవసాయ ప్రధానమైన దేశము. పూర్వకాలంలో ఎక్కువగా పల్లెటూళ్ళే ఉండేవి. పట్టణాలలో కంటే ఎప్పుడూ, ఇప్పుడు కూడా పల్లెల్లోనే పండుగ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. సకాల వర్షాలు కురవాలనీ, తమ ఎద్దులు శక్తిమంతంగా ఉండి, పొలాలను దుక్కి దున్నాలనీ, పంటలు సమృద్ధిగా పండాలని, తినడానికి ఏ లోటూ రాకుండా తిండి ఎప్పటికి దొరకాలని ప్రకృతి మాతను, వర్షాలు కురవాలనీ వరుణ దేవుని, తమ తమ ఆరాధ్య దేవతలను కొలుస్తూ జాతరలను కూడా నిర్వహిస్తారు.

మూడు, నాలుగు రోజులు జరిపే ఈ సంక్రాంతి సంబరాలు ఏడాదంతా ఆనందాన్ని కలిగిస్తాయి. ఏడాది కాలం పడిన కష్టానికి, ఎదురు చూపులకు తగిన ఫలితం – పంట లభించటం. పంట చేతికొచ్చి, ధాన్యరాశులతో గాదెలు నిండి, ఇళ్లు కళకళలాడుతుంటే, రైతన్నల మనస్సులు ఆనందంతో పరవశిస్తుంటే, వారందరూ ఆత్మీయులతో కలిసి పసందైన విందు జరుపుకునే పండుగరోజు కనుమ పండుగ. మన
తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్ధం పట్టే పండుగ సంక్రాంతి పండుగ. రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతూ, గోవృషభములను ఆనందింపజేసే పండుగ కనుమ పండగ. కనుక కనుమ పండుగకు ‘పశువుల పండుగ’ అని పేరు.

కనుమ పండుగ రోజున ఉదయాన్నే ఆవులను, గేదెలు, ఎద్దులు, దూడలను అన్నింటినీ శుభ్రంగా స్నానం చేయించి, వాటి మెడలో పూలమాలలు వేసి, కొమ్ములను కుదిరితే బంగారు లేక వెండి తొడుగులతో అలంకరించి, లేకపోతే పూమాలలతో అలంకరించి, కుంకుమ, పసుపు, గంధము, పూలతో పూజించి, ధూపం వేసి, హారతిచ్చి భక్తిగా పూజించి, వాటికి ఎంతో రుచికరమైన భోజనం పెడతారు. ఆ రోజున వాటితో ఏ పనీ చేయించ కుండా, అదిలించకుండా, సంతోషంగా ఉండేలా స్వేచ్ఛగా ఉంచుతారు.

ఆ కాలంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఎడ్లబండీలో లేదా జట్కా బండిలో వెళ్ళేవారు. ఎంతో భక్తితో ఆరాధించి, రోజంతా విశ్రాంతినివ్వాలనుకున్న ఎద్దులను ప్రయాణం కోసం శ్రమ పెట్టడం ఇష్టంలేక కనుమ నాడు ప్రయాణాలు చేసేవారు కాదు. పైగా హాయిగా నాలుగైదు రోజులు బంధువులందరూ కలిసి ఉంటే ఆనందాన్ని కలిసి అనుభవించ వచ్చును అని కూడా ఊళ్ళనుంచి వచ్చిన వారు కనుమ నాడు బయలుబేరేవారు కాదు. అలా కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకూడదని ఏర్పడి, అది కనుమ నాడు ప్రయాణం ప్రమాదమనే భావన కలిగి, కనుమ నాడు ప్రయాణాలను నిషేధించటమైనది. “కనుమ రోజు కాకైనా కదలదు” అనే సామెత ఏర్పడింది.

“కనుమనాడు మినుము తింటే, ఎనుమంత బలమొస్తుంది” అంటారు. అందుకనే కనుమ నాడు గారెలు, ఆవళ్ళు చేసుకుని తినటం ఆనవాయితీ అయింది. ఈ చలి కాలంలో మినుములు తింటే, ఒంట్లో తగినంత వేడి పెరిగి, జలుబు, దగ్గులు రావనీ, మినుముల వలన కండరాలు, ఎముకలు బలం కలిగి, నడుం నెప్పుల వంటివి రావనీ మినప్పప్పుతో చేసినవి తినమని అలా చెప్పారు.

కనుమ రోజున మినుములను, పెరుగును దానం చేస్తే మంచిదని చెప్తారు.

కనుమ రోజున కోడిపందాలు, గొర్రెపొట్టేళ్ళ పందాలు, ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు. చాలా కాలం క్రితం గ్రామస్థులు వినోదార్థం కోడిపందాలు, గొఱ్ఱె పొట్టేళ్ళ పందాలు, ఎడ్ల పరుగులు సరదాగా నిర్వహించేవారు, కొద్దిసేపు అందరూ చుట్టూరా కూర్చుని చూస్తూ ఆనందించేవారు. కోళ్ళకు కానీ గొర్రెలకు, ఎడ్లకు, మనుష్యులకు ఎవరికీ ఎటువంటి దెబ్బలు తగిలేవి కావు. కేవలం వినోదం కోసం ఆడించేవారు. కానీ కాలక్రమంలో అది వేలంవెఱ్ఱిగా మారి, వాటిమీద డబ్బులు పందాలు కాయటం, జల్లికట్టు పేరుతో ఎడ్లతో పాటు మనుష్యులు ప్రాణాలు పోగొట్టుకునే స్థితి ఏర్పడటం జరుగుతోంది. ఇది మంచిది కాదు. మన పూర్వీకులు అనుసరించిన సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆనందాన్ని పంచాలే కానీ వివేక హీనతతో కష్టాలు కొని తెచ్చుకోకూడదు.

కనుమ రోజున ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో కోలాహలంగా, సందడిగా ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.

సంక్రాంతి మూడు రోజులు యువకులు ఉత్సాహంగా గాలి పటాలు ఎగుర వేస్తూ ఆనందిస్తారు. కనుమ మూడవ రోజు కనుక, ఇంచుమించుగా రోజంతా గాలిపటాలను ఎగురవెయ్యటంలో, ఇతరుల గాలిపటాలను ఖండించటంలో సమయం గడిపి ఆనందిస్తారు. తమ గాలిపటాలను వేరే గాలిపటాలు తెగ్గొట్టినా తేలికగా తీసుకుంటారు, మనసుకు తీసుకుని బాధ పడరు. ఈ గాలిపటాలను ఎగురవెయ్యటం మనిషికి గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను బోధ పరుస్తుంది.

గాలిపటం దారం, ఎగురవేసేవారి చేతిలో ఉన్నప్పుడే అది సవ్యంగా ఎగురుతుంది. అలాగే పిల్లలు పెద్దల అధీనంలో, వారి శిక్షణలో ఉన్నప్పుడే చక్కగా రాణిస్తారు.

ఒకసారి దారం చేతిలోంచి విడిపోతే, ఆ గాలిపటం ఎక్కడికో వెళ్ళి పడిపోతుంది. అలాగే మానవులందరూ శాస్త్రము చెప్పిన ప్రకారము నడుచుకుంటూ ఉంటే జీవితం ఆనందప్రదంగా ఉంటుంది. శాస్త్ర ఆలంబనను వదిలివేసినవారి, పెద్దల మాటలను పెడచెవిన పెట్టి ప్రవర్తించేవారి జీవితాలు అస్తవ్యస్తమవుతాయి.

ఎవరూ కూడా తాను ఎగురవేసి ఆనందిస్తున్న గాలిపటం తెగ్గొట్టబడి ఎగిరిపోయినా, బాధ పడుతూ కూర్చోరు. వేరొకటి ఎగురవేస్తారు. అలాగే జీవితంలో ఎలాంటి కష్టసుఖాలు కలిగినా చలించకుండా ఉండాలని నేర్చుకోవాలి.

ఒకప్పుడు పండగ అంటే ఊరిలో జనాలు అందరూ కలిసి మెలిసి ఐకమత్యంగా జరుపుకునేవారు. కానీ ఇప్పటి తరం వారిలో చాలా మంది దంపతులిద్దరూ ఉద్యోగస్థులవటం వలన పండగ అంటే కేవలం ఒక సెలవు దినంగా మాత్రమే భావిస్తున్నారు. పండగల యొక్క అసలు ఉద్దేశ్యాలను విస్మరిస్తూ ఇంట్లో విశ్రాంతికే పరిమితమవుతున్నారు. ఇప్పుడు ఎవరికీ కూడా అప్పటి వారిలా పండగ జరుపుకునేందుకు సమయం లేదని భావిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే తరువాతి తరాల వారికి పండగ అంటే ఒక సెలవు దినము మాత్రమే అనే పరిస్థితి ఏర్పడవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ మన పండుగల ప్రాముఖ్యతలను తెలుసుకుంటూ, వాటిని పాటిస్తూ, పిల్లలకు తెలియజెయ్యాలి, వారితో ఆచరింప జెయ్యాలి.

పండుగ అంటే ఒక పవిత్ర దినం, ఆధ్యాత్మిక శక్తి తరంగాలు పొందే శుభ దినం. పండుగ అంటే మహదానందప్రదం. పండుగ అంటే ఒక నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగించే సందర్భం. పండుగ అంటే బంధుమిత్రులతో ఆత్మీయులందరితో కలిసి ఆనందాలను పంచుకుంటూ పెంచుకునే ఒక ప్రత్యేకమైన రోజు. అందుకే నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉన్నవారు కూడా, పండగరోజు మాత్రం అందరూ కలిసి తమకు ఉన్న దాంట్లోనే వేడుక చేసుకుంటూ, సంతోషంగా గడుపుతారు. ఏమున్నా, లేకపోయినా సంతోషంగా గడపడమే పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని ఏమీ తెలియని సాధారణ జనులు కూడా భావిస్తారు. ఎటువంటి వారైనా పండుగ జరుపుకునే క్రమంలో తమకున్న బాధలు మరిచిపోయి, ఉల్లాసంగా గడుపుతారు. ఈ విధంగా పనిభారం, ఒత్తిడి, ఇతర మానసిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది, ఆత్మీయుల పలకరింపులతో సంతోషం కలుగుతుంది. కనుక పండుగనాడు ఆత్మీయులందరితో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపాలి, నూతనోత్తేజాన్ని పొందాలి.

ప్రకృతికి, మానవులకు, పశువులకు ఉన్న అవినాభావ సంబంధాన్ని చాటి చెప్పే పండుగ కనుమ పండుగ. ఇటువంటి మహత్తరమైన కనుమ పండుగ మనందరికీ కనులకు కాంతిని, మనసుకు శాంతిని కలిగించు గాక !

ప్రకృతి మాతకు జై.
గోవృషభములకు జై.
సనాతన సంప్రదాయములకు, పర్వదినములకు జై జై.

రచన :
డా.సోమంచి(తంగిరాల)విశాలాక్షి.
విశ్రాంత సంస్కృతాచార్య.
ఉపాధ్యక్షురాలు,
వేద సంస్కృతి సమితి