Skip to content Skip to footer

सर्वे जनाः सुखिनो भवन्तु

सत्यं वद । धर्मं चर

Dassera

ఓం నమశ్శివాయై చ నమశ్శివాయ ఓం నమశ్శివాయ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 

డా.టి.(ఎస్)విశాలాక్షి.

 సెల్ – 9963964033 

దసరా పండుగ 🙏

“దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా
నిశ్శేష దేవగణ శక్తి సమూహ మూర్త్యా !
తామంబికామకఖిల దేవ మహర్షి పూజ్యాం
భక్త్యా నతాః స్మ విదధాతు శుభాని సా నః”!!

84 లక్షల జీవరాసులలో ముక్తి పొందటానికి యోగ్యమైన మానవ ఉపాధి లభించినందుకు ముక్తి కొరకై సాధన చేసేందుకు ఉపకరించే కాలం దక్షిణాయనం. ఈ దక్షిణాయనంలో వచ్చే పండుగలలో, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింప చేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా పండగ. హైందవుల మందరము, ఆసేతు హిమాచలము అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పెద్ద పండుగలలో ఒకటి దసరా పండగ.

మన ప్రతి పండగలోనూ ఎన్నో ఆధ్యాత్మిక, ధార్మిక, వైజ్ఞానిక, సామాజికపరమైన, ఆరోగ్యపరమైన, యోగపరమైన అంశాలు లీనమై ఉంటాయి. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మన పండుగలలో జ్యోతకమవుతూ, సమాజానికి హితకరములై, శాస్త్రీయ విలువలతో ఉంటాయి. వాటిని గుర్తించి భక్తి శ్రద్ధలతో ఈ పండగలను ఆచరించాలి. మనిషిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేవి, శుద్ధసత్వ గుణాన్ని వృద్ధి చేసుకునే అవకాశం కలిగించేవి నోములు, వ్రతాలు. నియమపాలనే వ్రతము. దైవానుగ్రహం కోసం, శాస్త్రంలో చెప్పినట్లుగా చేసే పూజలనే, నోములు, వ్రతములు అంటాము. వ్రతము అంటేనే నియమ పాలన. కొన్ని కొన్ని వ్రతాలకు ప్రత్యేకమైన నియమాలుంటాయి. ఆ నియమాలను పాటించటం వలన ఇంద్రియ నిగ్రహం, చిత్తశుద్ధి, ఆరోగ్యము, మనశ్శాంతి, ఆనందము, సామాజిక సఖ్యత కలుగుతాయి. మనను చూసి పిల్లలు కూడా సత్సంప్రదాయాలను పాటించటం అలవాటు చేసుకుంటారు.

దశ అహః అనగా పది రోజులు అని అర్థము. దశ అహః అనే పదము పలకటంలో దశహర అయింది. దశహర, పది రోజులు అనే పదము కాలక్రమంలో ‘దసరా’గా మారింది. దసరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది. ఈ పది రోజుల పండుగని “నవరాత్ర వ్రతము” అనీ, “దేవీ నవరాత్రులు”, “శరన్నవరాత్రులు” అని వ్యవహరిస్తాము. తొమ్మిది రోజులు నియమ నిష్ఠలతో జగన్మాతను పూజించే వ్రతము ఈ శరత్కాలంలో చేసే శరన్నవరాత్ర వ్రతం.

మన మహర్షులు సంవత్సర కాలంలో మూడు సార్లు తొమ్మిది రోజులు చొప్పున వ్రత దీక్షతో దైవీ శక్తిని ఆరాధించటం అలవాటు చేశారు. చైత్ర మాసంలో వసంత నవరాత్రులలో, ఆశ్వయుజంలో దేవీ నవరాత్రులలో, మాఘమాసంలో శ్యామలా నవరాత్రులలో శక్తిని ఆరాధిస్తాము. ఈ మధ్యన మనం గణపతి నవరాత్రులలో గణపతి పేరున పరమాత్మను ఉపాసిస్తున్నాము.

తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. నవరాత్రులు ఆరాధించటమంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం.

నవరాత్రి అంటే నూతనమగు రాత్రి లేక కొత్త రాత్రి అని అర్థం. నవ శబ్దానికి “ప్రకృష్టః నవః ప్రణవః” అనే మరొక అర్థం చెప్పవచ్చును. ప్రణవము అంటే ఓంకారము. గొప్పదగు నూతనత్వము. మనము ప్రతి నామానికి ముందు ఓం అని అంటాము. కనుక అసంఖ్యాకమైన సార్లు ఓంకారాన్ని ఉచ్చరించటం వలన ఆరాధించబడు జగన్మాతకు, ఆ అమ్మ నామాలను ఉచ్చరించే మనకు ఉత్కృష్టమైన నూతనత్వము కలుగుతుంది. ఆ నూతనత్వము మనలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని పెంపొందింప చేస్తుంది. మనకు భక్తి శ్రద్ధలు కలిగి జగన్మాత అనుగ్రహంతో శుభం కలుగుతుంది.

“రాతి సుఖమితి రాత్రిః” – సుఖమునిచ్చునది కనక రాత్రి అని చెప్పబడింది. నవరాత్రులు అంటే కొత్త సుఖాన్ని అనుభూతికి తెచ్చే రాత్రులు. ఈ తొమ్మిది రోజుల దీక్ష వలన పదవరోజు విజయం లభిస్తుంది. అంటే తొమ్మిది రోజుల దీక్షకు ఫలం లభిస్తుంది. కనుక పదవ రోజును “విజయదశమి” పేరిట పండుగ జరుపుకుంటాము.

మనకున్న అనేక పూజా సంప్రదాయములలో షణ్మతములు ముఖ్యమైనవి. అందులో శాక్తేయము ఒకటి. శాక్తేయము అంటే శక్తిని – జగన్మాతను – అమ్మవారిని ముఖ్యదేవతగా, మిగతా దేవతలను ఆమెకు అభిన్న దేవతలుగా భావించి ఆరాధించటం. అన్ని సంప్రదాయముల వారు శక్తిని ఆరాధిస్తారు.

జగన్మాత ఆదిపరాశక్తి యొక్క గొప్పదనాన్ని, మహిమను గురించి, దేవీ భాగవతము, మార్కండేయ పురాణము మొదలైన అనేక పురాణములలోను, త్రిపురోపనిషత్తు, దేవ్యుపనిషత్తు, భావనోపనిషత్తు, బహ్వృచోపనిషత్తు, సరస్వతీ రహస్యోపనిషత్తు మొదలగు అనేక ఉపనిషత్తులలోనూ, త్రిపురా రహస్యములోను చెప్పబడింది. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలవబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో ఆరాధించబడుతున్నది. మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా, దుర్గగా, పార్వతిగా, హైమవతిగా, అపరాజితా, భవానిగా, లలిత, జయంతి, మంగళ, భద్రకాళి, కాపాలిని, క్షమా, శివదూతి, స్వాహా, స్వధా, చాముండి, విష్ణుపత్ని, ఈశ్వరి ఇటువంటి అనేకమైన నామాలతో ఆరాధించబడు తున్నది.

“విద్యా ప్రదాన సమయే శశికోటి శుభ్రామ్
ఐశ్వర్య దాన సమయే నవ విద్రుమాభామ్ !
విద్వేషి వర్గ దళనే తు తమాల నీలామ్
దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే”!!

ఉన్నది ఒక్క శక్తే ! ఆ శక్తి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఆమె సృష్టి, స్థితి, లయ, త్రిరోధాన, అనుగ్రహములనే పంచకృత్యములను చేయునటువంటి మహా చైతన్య శక్తి. దసరా నవరాత్రులలో ఆశ్వియుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజులు ఈ జగన్మాతను బాలా త్రిపురసుందరిగా, గాయత్రీ మాతగా, అన్నపూర్ణాదేవిగా, శ్రీ మహాలక్ష్మి దేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా, సప్తమి రోజున శ్రీ మహాసరస్వతీ దేవిగా, అష్టమి నాడు దుర్గామాతగా, నవమి నాడు మహిషాసుర మర్దినిగా, దశమినాడు జయా విజయా సహిత అపరాజితా దేవిగా – రాజరాజేశ్వరీ దేవిగా ఆరాధిస్తాము. తొమ్మిది రోజులు కఠినమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన నియమములను పాటిస్తూ, నామ మంత్ర జపం, నామ పారాయణ చేస్తూ, కీర్తనలతో, భజనలతో కొలుస్తూ, ఉపవాస నియమాలను, నక్త వ్రతముల వంటి వాటిని పాటిస్తూ దశమినాడు చక్కగా జగన్మాతను షోడశోపచారములతో పూజించి, అనేక విధములైన పిండి వంటలు తయారు చేసి, నైవేద్యం పెట్టి అమ్మను ఆరాధిస్తాము. ఆ పిండి వంటలను ప్రసాదముగా బంధుమిత్రులందరికీ పెట్టి, ఆరగిస్తాము.

సప్తమి తిథిన మూలా నక్షత్రం రోజున ఆదిపరాశక్తిని సరస్వతీ మాతగా, జ్ఞానమును అనుగ్రహించే జ్ఞానాధిష్ఠాన దేవతగా ఆరాధిస్తాము. అష్టమినాడు – దుర్గాష్టమి నాడు మన కష్టాలు పోవాలని దుర్గము వంటి రక్షణనిచ్చే దుర్గా మాతను పూజిస్తాము. మహర్నవమి రోజున ప్రతి ఒక్కరమూ కూడా, ఎవరికి వారు, వారి వారి జీవికకు ఆధారభూతములైన ఆయుధాలను అంటే పెన్నులను, పుస్తకాలను, ఏ వృత్తి పని చేసేవారు ఆ వృత్తి సామగ్రిని, దేశ రక్షణ చేసే సైనికులు ఆయుధాలను మొదలైన వాటిని ఆరాధిస్తాము. సమాజంలోని ప్రజలందరూ వారి వారి వృత్తి నిర్వహణకు ఉపకరించే ఆయుధాలను, సామగ్రిని, సాధనములను పూజించటమన్నది సమాజ రక్షణకు, దేశ రక్షణకు, జాతి రక్షణకు, సంస్కృతి రక్షణకు ప్రాతిపదిక. విజయదశమి శక్తి పూజకు పరాకాష్ఠ. మనలో ఉన్న శక్తిని విశ్వచైతన్య శక్తితో అనుసంధానించే ఒక అద్భుతమైన ప్రక్రియ. మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృత పరిచే, దైవ అనుగ్రహంతో, మంత్ర శక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృత పరిచే ఒక వ్రతము ఈ నవరాత్ర వ్రతము.

ఈ ఆదిపరాశక్తిని లక్ష్మీ, గాయత్రీ, సరస్వతీ, రాధ, దుర్గా అనే ఐదు పరిపూర్ణ మూర్తులుగా ఆరాధిస్తారు.

ఈ తల్లిని దేవతలు “అమ్మా ! నీవే సర్వకారణభూతురాలివి, కార్య కారణ రూపిణివి, క్రియా రూపిణివి, నీవు లేనిదే ఏదీ లేదు, అంతా నీలోనే ఉంది తల్లి అంటూ కీర్తించారు.

“త్వమేవ కారణం కార్యం
క్రియా జ్ఞానం త్వమేవ హి ! త్వామంబ న వినా కించిత్
త్వయి సర్వం ప్రతిష్ఠితమ్”!!

శక్తి స్వరూపిణి అయిన జగన్మాత అవతారాలలో నవదుర్గలు కూడా ముఖ్యమైన వారు.

“ప్రథమం శైలపుత్రీ చ,
ద్వితీయం బ్రహ్మచారిణి !
తృతీయం చంద్రఘంటేతి,
కూష్మాండేతి చతుర్ధకం !!
పంచమం స్కందమాతేతి !
షష్టం కాత్యాయనీతి చ !!
సప్తమం కాళరాత్రీతి !
మహాగౌరీతి చాష్టమం !!
నవమం సిద్ధిదా ప్రోక్తా !
నవదుర్గాః ప్రకీర్తితాః !! ఉక్తాన్యైతాని నామాని ! బ్రహ్మణైవ మహాత్మనా”!!

సాక్షాత్తుగా బ్రహ్మ దేవుని చేత చెప్పబడిన ఈ నవ దుర్గారూపాలుగా జగన్మాతను ఆరాధిస్తాము.

ఆదిపరాశక్తిని దశ మహావిద్యలుగా, మహావిద్యాధి దేవతలుగా ఆరాధిస్తాము.

“కాళీ, తారా, మహా విద్యా !
షోడసీ, భువనేశ్వరీ !!
భైరవీ, ఛిన్నమస్తా చ !
విద్యా ధూమావతీ తథా !!
బగళా సిద్ధవిద్యా చ !
మాతంగీ, కమలాత్మికా !!
ఏతా దశ మహా విద్యాః !
సిద్ధ విద్యాః ప్రకీర్తితాః” !!

సిద్ధిదాత్రి రూపంలో అమ్మను ఆరాధిస్తే అష్టసిద్ధులు లభిస్తాయని, ముక్తి పొందగలుగుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ నామరూపాలతో ఆరాధించినా మనము ఆరాధించుచున్నది ఆదిపరాశక్తిని, సృష్టిలో ఉన్న దివ్యచైతన్య శక్తిని.

ప్రపంచమంతా ఆవరించి అమ్మ శక్తి ఉన్నది. విశేషంగా మనము అష్టాదశ శక్తి పీఠాలుగా ఆరాధిస్తాము. పంచాశత్ శక్తి పీఠాలనీ, నూటొక్క శకపీఠాలలో అమ్మ కొలువై ఉన్నదని ఆరాధిస్తాము.

ఆదిపరాశక్తి బ్రహ్మ, విష్ణు, రుద్రులను పుట్టించి, వారికి సృష్టి, స్థితి, లయలను చేసే బాధ్యతలను అప్పగించి, సరస్వతీ, లక్ష్మీ, ఉమా అనే దేవతలను సృష్టించి, సృష్టి కార్యక్రమంలో త్రిమూర్తులకు సహాయపడమని నియోగించింది, అని దేవీ భాగవతంలో చెప్పారు.

శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు అని జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ప్రథమ శ్లోకంలోనే చెప్పారు.

“శివః శక్యాయుక్తో యది, భవతి శక్తః ప్రభవితుం !
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి”!!
అని చెప్పారు. అంటే శక్తి లేకపోతే శివుడు కనీసం స్పందించను కూడా లేడట. శక్తి లేకపోతే, చలనము, స్పందన ఉండదు.

“యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా !
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః!!”

పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి జగన్మాత. ఆ సంకల్పము వల్లే సృష్టి స్థితి లయలన్నీ జరుగుతున్నాయి. జగన్మాత ఆదిపరాశక్తి ప్రకృతి అయితే, పరమాత్మ పురుషుడు. ప్రకృతి పురుషుల కలయిక వల్లే సృష్టి యేర్పడుతుంది. అంటే శివపార్వతుల చిద్విలాసము యావద్విశ్వము. అమూర్త బ్రహ్మము మూర్తముగా భాసించింది.

ఈశ్వరుడని కొలిచినా, విష్ణువు అని కొలిచినా, జగన్మాత అంబిక అని కొలిచినా ఉన్న శక్తి ఒక్కటే అని మనకి ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.

“ఏకమే వాద్వితీయం బ్రహ్మ”. ఒక్కటిగా ఉన్న ఆ శక్తిని, చిచ్ఛక్తినే మనము అమ్మవారిగా, జగన్మాతగా ఆరాధిస్తున్నాము.

దేవీ మాహాత్మ్యముగా చెప్పబడే చండీ సప్తశతిలో జగన్మాత మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహా సరస్వతిగా దుష్ట రాక్షసులను దునుమాడిన వైనాన్ని కీర్తించారు.

అమ్మవారు దేవతలకు – ఎప్పుడు దుష్ట రాక్షసుల నుంచి బాధలు కలిగినా, తాను ఆవతరించి, దుష్ట శిక్షణ చేస్తానని అభయమిచ్చారు.

“ఇత్థం యదా యదా బాధా
దానవేభ్యో భవిష్యతి !
తదా తదాऽవతీర్యాహం
కరిష్యామ్యరి సంక్షయమ్!!”

జగన్మాత, యోగ నిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును జాగృత పరిచి, మధు కైటభులనే రాక్షసులను సంహరింపజేసింది.

మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించగా, దేవతలు బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు, రుద్రుల దగ్గరికి వెళ్ళి మహిషాసురుని ఆగడాలను గురించి చెప్పారు. ఆ మాటలు వినగానే శివకేశవులకు ధర్మాగ్రహం కలిగింది. ఆ క్రోధం ఒక ఆకృతి దాల్చి, వెలుగు రూపంలో బయటకొచ్చింది. దేవతలందరి ముఖాల నుంచి తేజస్సు బయటికి వచ్చి, ఆ సమిష్టి తేజస్సు ఒక మహాద్భుత రూపం దాల్చి, అష్టభుజాలతో మహాలక్ష్మీదేవిగా, ఆదిపరాశక్తిగా భాసించింది. ఆమె మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి మహిషాసురమర్దినిగా కీర్తించబడింది.

జగన్మాతే ధూమ్రాక్షుడిని, రక్తబీజుడిని, చండ, ముండులను, శుంభ, నిశుంభులనే రాక్షసులను సంహరించింది. ఈ రాక్షసులందరూ కూడా బ్రహ్మదేవుడిని గురించి, పరమేశ్వరుడిని గురించి తపస్సులు చేసి వరాలు పొందినటువంటి వారు. దేవతల నుంచి ఎటువంటి భయాలు లేకుండా వరాలు పొందారు. కానీ స్త్రీ అంటే చులకన. ఆడవారు మననేం చేస్తారులే ! అనే చులకన భావన స్త్రీల మీద ! కనుకనే ఆదిపరాశక్తి అమ్మవారు, జగన్మాత – స్త్రీ శక్తి ఈ రాక్షసులందరినీ కూడా తనలో నుంచి ఉద్భవింపజేసిన తన శక్తులతో తన శక్తులే అయిన బ్రాహ్మీ , వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, ఐంద్రీ, వారాహి, నారసింహీ, చాముండా, శ్యామలా, కాళీ మొదలైన దేవతా గణాలను ఉద్భవింపజేసి, వారితో కలిసి రాక్షసులతో యుద్ధం చేసి, రాక్షసులందరినీ సంహరించింది. శుంభుడు జగన్మాత చండికతో – “నీవు ఒక్కదానివే యుద్ధం చేస్తానన్నావు, ఇంతమందిని తోడు తెచ్చుకున్నావే !”, అంటాడు. దానికి అమ్మవారు –

” ఏకైవాహం జగత్యత్ర
ద్వితీయా కా మమాపరా ! పశ్యైతా దుష్ట మయ్యేవ
విశన్త్యో మద్విభూతయః”!! అని పలికింది.

సర్వ దేవతా రూపాలు అమ్మలో కలిసిపోయి జగదంబ ఒక్కత్తే అయి ప్రకాశించి శుంభాసురుడిని సంహరించింది. ఈ దుష్ట రాక్షసులందరినీ జగన్మాత ఈ నవరాత్రులలో సంహరించినందున నవరాత్రులలోను జగన్మాత యొక్క వివిధ రూపాలను, అవతారాలను మనము కీర్తిస్తాము, ఆరాధిస్తాము. విజయదశమి నాడు, జగన్మాత దుష్ట రాక్షసులను సంహరించి విజయము గాంచిన రోజున మనమందరము విజయదశమి పండుగను వేడుకగా జరుపుకుంటాము.

మథు, కైటభులు అనే రాక్షసులు అహంకార మమకారాలకు ప్రతీకలు. నేను నాది అనే భావాలకు ప్రతీకలు. మధువు అంటే తేనె. అన్నింటి కంటే మనకు ఇష్టమైనది, తీయనైనది ఎవరికి వారే ! నేను అనేదే ! ఒక్క నేను అనేది ఉంటే, అనేకమైన నావి, నా వారు, నా బంధువులు, నా అధికారము, నా పదవులు వంటి అనేకమైనవి బయలుదేరతాయి. ఒక్కతేనె చుక్క ఉంటే, అనేకమైన కీటకములు చుట్టూ చేరినట్లుగా, ఒక్క నేనుకి, అనేకమైన – నావి అనేవి బయలుదేరతాయి. ఈ నేను, నాది అనే అహం, మమ భావాలను సంహరించటమే మధుకైటభములను సంహరించటం. ధూమ్రాక్షుడు లేక ధూమ్రలోచనుడు అంటే పొగ బారిన, మసకబారిన కన్నులు కలవాడు, అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు అని అర్థం. కళ్ళు మసకబారినప్పుడు యదార్థము కనిపించదు. అలాగే అజ్ఞానము వలన జ్ఞానము తెలియబడదు. వివేక జ్ఞానము ఉదయించదు. కనుక మనలోని ఆ అజ్ఞానాన్ని సంహరించాలి. రక్తము అంటే రాగము, ప్రేమ. రక్తబీజుడు – అది ఎంత వద్దనుకున్నా ఆ ప్రేమ ఆనే బీజము మొలకెత్తుతూనే ఉంటుంది. చెట్టుకొమ్మలను నరికి వేస్తున్నా, మళ్ళీ మళ్ళీ ఎలా పుడతాయో, అదేవిధంగా బీజము మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతూనే ఉంటుంది. కాళికాదేవి తన పెద్ద నాలుకను చాపి, ఆ రక్తబీజుని శరీరము నుంచి కారే రక్తబిందువులను మింగేసి, ఇంక మళ్ళీ రక్తబీజులు పుట్టే అవకాశం లేకుండా చేసినప్పుడు, జగన్మాత రక్తబీజుడనే రాక్షసుని సంహరించింది. అలాగే మనలోని రాగద్వేషాలను పూర్తిగా ఎప్పుడైతే మనము జయిస్తామో, అప్పుడు జగన్మాత దర్శనము మనకు ప్రాప్తిస్తుంది.

మహిషము అంటే ఎద్దు, జంతువు. మహిషాసురుడు అంటే జంతు తత్వము కలిగినటువంటి వాడు. రాజస తామస గుణాలకు ప్రతీకలు రాక్షసులు. మహిషాసురుడిని, చండ ముండులను, శుంభ, నిశుంభులను జగన్మాత సంహరించింది అంటే, మనలోనే ఉన్న కామ క్రోధాది అరిషడ్వర్గాలను, లోభ మొహాలను, అహంకారాన్ని మనము నశింప చేసుకోవాలి అని గ్రహించాలి. చండ ముండాది రాక్షసులు దుర్మార్గమైన, ధర్మ విరుద్ధమైన బలదర్పాలకు ప్రతీకలు. కనుక అటువంటి బలహీనతలను మనము జయించాలి. మనలోని రజోగుణాలను, తమో గుణాలను అరికట్టి, సత్వగుణాన్ని వృద్ధి పరచుకుని, శుద్ధ సత్వ గుణాన్ని పొందడానికి సాధన చేయాలి. అది ఈ జగన్మాతను నవరాత్రులలో ఆరాధించడం వలన సాధ్యపడుతుంది. శుద్ధ సత్వ గుణాన్ని వృద్ధి చేసుకుంటే దైవత్వాన్ని దర్శించగలుగుతాము, పొందగలుగుతాము.

జగన్మాత ఆదిపరాశక్తినే ఆదిలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, విజయలక్ష్మిగా, ధైర్య లక్ష్మిగా, గజలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, వరలక్ష్మిగా, అనంతలక్ష్మిగా ఆరాధిస్తాము. ఈ మాతయే స్వర్గములో స్వర్గలక్ష్మిగా, ప్రతి గృహములోను గృహలక్ష్మిగా విరాజిల్లుతున్నది. అందుకనే ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా సువాసినీ స్త్రీలను సాక్షాత్తు జగన్మాత స్వరూపములుగా ఆరాధించి సువాసినీ పూజలు చేస్తాము. బాలికలను బాలా త్రిపురసుందరీ స్వరూపంగా భావించి బాలా పూజలు చేస్తాము. కన్యలను కన్యకా పరమేశ్వరి స్వరూపంగా భావన చేసి పూజిస్తాము.

స్త్రీ అనే పదము సకార, తకార, రకారములకు ఈ కలిపితే ఏర్పడుతుంది. ‘ఈం’ అన్నది శక్తి బీజం. త్రిగుణాలకు అమ్మవారి శక్తి కలిస్తే స్త్రీ ఏర్పడింది. ఆ స్త్రీ శక్తిని గుర్తించి, పూజించే పండుగ ఈ శరన్నవరాత్రుల పండుగ.

జగన్మాత దుర్గముడు అనే రాక్షసుడిని ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజున సంహరించినందున మనము ఈ అష్టమిని “దుర్గాష్టమి”గా భావించి ఆరాధిస్తాము.

నవమి నాడు అమ్మ మహిషాసురుని సంహరించి నందున
“జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే” అంటూ కీర్తిస్తాము.

విజయదశమి పండుగ జరుపుకోవటంలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి భేదం ఉండవచ్చు కానీ హైందవులందరూ ఈ పండుగ జరుపుకుంటారు. విజయదశమి పండుగ దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయముగా జరుపబడుతున్నది. మానవులలోనే దైవీ గుణాలుంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. మనలోని ఆసురీ గుణాలను పోగొట్టుకుని, దైవీ గుణాలను వృద్ధి పరచుకోవాలి.

ఈ విజయదశమి పండుగ జరుపుకోవడానికి మనకు అనేక కారణాలు కనిపిస్తాయి. కాలంలో వచ్చే మార్పులను బట్టి దైవ శక్తిని ఆరాధించటము ఒక భావన అయితే, మన లోని దైవ శక్తిని వృద్ధి పరచుకోవటము, సమాజంలో అందరితో అన్యోన్యంగా సహకరిస్తూ ఉండటం అన్నది మరొక అంశము.

ఈ విజయదశమినాడే అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో కౌరవుల మీద విజయం సాధించి విజయుడు అయ్యాడు. శమీ వృక్షము మీద పెట్టిన తమ ఆయుధాలలో నుంచి తన గాండీవమును తీసుకుని యుద్ధం చేసి విజయం సాధించాడు ఫల్గుణుడు. కనుక మనము ఈనాడు విజయదశమి పండుగ జరుపుకుంటున్నాము. విజయదశమి నాడు శమీ వృక్షాన్ని పూజిస్తాము.

“శమీ శమయతే పాపం
శమీ శత్రు వినాసినీ !
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియ వాదినీ”
అని చెప్తూ శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తాము. ఈ విజయదశమి పండగనాడు అందరూ కూడా ఈ శమీ పత్రాలను – శమీ వృక్షపు ఆకులను పెద్దలకు ఇచ్చి నమస్కరిస్తారు. పెద్దలు వాటిని తీసుకుని పిల్లలను ఆశీర్వదిస్తారు.

ఈ విజయదశమి రోజునే శ్రీరామచంద్రుడు రావణాసురుని సం. రించినందున, విజయదశమి రోజున “రామలీల”ను ప్రదర్శిస్తారు. “రావణ దహనం” చేస్తారు.

ఈ శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు నియమ పాలన చెయ్యలేని వారు త్రిరాత్ర వ్రతం చేసినా ఫర్వాలేదు. మూడు రోజులు కూడా దీక్ష వహించలేని వారు మహర్నవమినాడు కనుక అమ్మవారి నవరూపాలను ఆరాధించి పూజలు చేసినట్లయితే నవరాత్రుల వ్రత ఫలం లభిస్తుంది.

మన సంస్కృతి సంప్రదాయాలు మన భారతదేశానికి ఆత్మ వంటివి. మన సంప్రదాయాలను, సంస్కృతిని ఆచరిస్తూ మనం రక్షించుకోవాలి. మన ప్రతి పండుగలోను ఉన్న సామాజిక ప్రయోజనాన్ని, మన శారీరక, మానసిక ఆరోగ్య సిద్ధిని, ఆత్మ శక్తి, దేశభక్తి కలిగిన సౌశీల్యతను మనం గుర్తించి ఆచరిస్తే మన భారత జాతి రక్షణ జరుగుతుంది. జగన్మాతను ఆరాధించడం వల్ల దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కలుగుతుంది.
జగన్మాత ఆరాధన వలన, దుర్జనుల వలన సంఘానికి చేటు కలగకుండా, ఆధివ్యాధుల సమస్యలు లేకుండా దేశానికి భద్రత కలుగుతుంది.

“నమస్తే శరణ్యే శివే సానుకంపే
నమస్తే జగద్వ్యాపికే విశ్వమూర్తి !
నమస్తే జగద్వంద్య పాదారవిందే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే”!!

“శ్రీ విద్యాం జగతాం ధాత్రీం
సర్గస్థితిలయేశ్వరీం !
నమామి లలితాం విద్యాం
మహా త్రిపుర సుందరీమ్”!!

 🙏🙏 స్వస్తి  🙏🙏

రచన : డా.ఎస్(టి)విశాలాక్షి
విశ్రాంత ఆచార్యురాలు,
సంస్కృతము. విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వము.
సెల్ నంబర్ –
996 396 4033